ధరణిలో ఆస్తుల నమోదుకు.. గడువేమీ లేదు

ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు నిరంతర ప్రక్రియ అని దీనికి తుది గడువేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల గుర్తింపు కోసం వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు హైకోర్టుకు తెలియజేసింది. 15 రోజుల్లోగా ధరణిలో ఆస్తులు నమోదు చేసుకోకపోతే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్న ప్రజలకు సర్కారు ప్రకటనతో ఊరట లభించినట్లయింది.

మరోవైపు ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల గుర్తింపు కోసం ఇస్తున్న దరఖాస్తులో ఆధార్‌ సంఖ్య, కులం తదితర వివరాల సేకరణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే దీనిపై పూర్తి వివరాలతో నవంబరు 2లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని, ఆ ప్రతిని రెండు రోజుల ముందే పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఇవ్వాలని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీచేసింది.