ఓటీటీలపై సినిమా తరహా సెన్సార్ షిప్ ఉండదు: కేంద్రం స్పష్టీకరణ

దేశంలో  ఓటీటీలు, డిజిటల్ మీడియా కంటెంట్ నియంత్రణకు కేంద్రం నిన్న నియమనిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్రం తన మార్గదర్శకాలపై మరింత స్పష్టతనిచ్చింది. ఓటీటీలపై సినిమాల తరహాలో సెన్సార్ షిప్ ఉండదని వెల్లడించింది.

దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖారే మాట్లాడుతూ… ఓటీటీలు, డిజిటల్ మీడియాను క్రమబద్ధీకరించే క్రమంలో మూడు విస్తృత లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు తెలిపారు. వివిధ రకాల మీడియాలు ఒకదానికొకటి విరుద్ధమని, అన్నిటికీ ఒకే తరహా ప్రమాణాలు లేకపోయినప్పటికీ సారూప్యతలు ఉండాలని అభిలషించారు.

ఓటీటీ వేదికలపై ప్రసారమయ్యే కంటెంట్ కు సంబంధించి సినిమాల తరహాలో సెన్సార్ షిప్ ఉండదని, ఆ కంటెంట్ కు సంబంధించి సదరు ఓటీటీ వేదిక నుంచి ఓ స్వీయ వర్గీకరణ ఉంటుందని ఖారే వివరించారు. వయసును ప్రమాణంగా చేసుకుని సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఓటీటీ వేదికలేదనని వెల్లడించారు. ఆ కంటెంట్ ను ఏ వయసుల వారు చూడొచ్చు అనేది ఆ ఓటీటీ వేదిక వర్గీకరించి తెలియజేయాలని అన్నారు. ఆ కంటెంట్ యూనివర్సల్ లేదా ఏడేళ్లకు పైన, 13 ఏళ్లకు పైన, 16 ఏళ్లకు పైబడిన వారు చూసేదా? లేక పెద్దల చిత్రమా? అన్నది ఓటీటీ వేదికలే వర్గీకరించాలని స్పష్టం చేశారు.

ఆ కంటెంట్ ను చూసే ప్రేక్షకుడికి సమాచారంతో కూడిన ఎంపికకు అవకాశం ఉండాలన్నది తమ ఆలోచన అని ఖారే వివరించారు. వయసుకు సంబంధంచి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు అంతర్జాతీయంగా అమలు చేస్తున్నవేనని పేర్కొన్నారు.