Kisan mahapanchayat: దేశం కోసం ఈ పోరాటం: రాకేష్‌ తికాయత్‌

దేశాన్ని కార్పోరేట్లు దోచుకోకుండా ఉండేందుకు తాము పోరాటం చేస్తున్నామని.. దేశం కోసం ఈ పోరాటమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేష్‌ తికాయత్‌ పేర్కొన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ముజఫర్‌ నగర్‌లోని ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలో ఆదివారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి మేథాపాట్కర్‌, యోగేంద్ర యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. ముజఫర్‌ నగర్‌ మహా పంచాయత్‌ ప్రపంచలోనే అతి భారీ రైతు సమావేశం కావడం విశేషం. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ… అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని రైతు సంఘాలు ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి సమావేశాలు దేశవ్యాప్తంగా జరుగుతాయని .. దేశాన్ని విక్రయించడాన్ని నిలిపివేయాలని కోరుకుంటున్నామని అన్నారు. దీంతో రైతులు రక్షించబడతారని, అలాగే దేశం కూడా రక్షించబడుతుందని అన్నారు. వ్యాపారాలు, ఉద్యోగులు, యువత అందరూ రక్షించబడతారు.. అదే ఈ మహాపంచాయత్‌ లక్ష్యమని అన్నారు. జనవరి 22న కేంద్రం రైతు నేతలతో చర్చలు నిలిపివేసిందని, తొమ్మిదినెలలుగా ఆందోళన చేపడుతున్న రైతుల్లో సుమారు 600 మందికి పైగా మరణించారని.. అయినా ప్రభుత్వం సంతాపం కూడా ప్రకటించలేదని, ఈ దేశాన్ని ఎవరు విక్రయిస్తున్నారో.. వారిని గుర్తించాలని అన్నారు. కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని, మన వ్యవసాయ భూములను, రహదారులను, విద్యుత్‌ లైన్లు, ఎల్‌ఐసి, బ్యాంకులను అదానీ, అంబానీ వంటి కార్పోరేట్‌లకు విక్రయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌సిఐ గిడ్డంగులు, పోర్టులను కూడా అమ్మకానికిపెట్టిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. మిల్లులు చెరుకు రైతులకు రూ. 12వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి వుందని, యోగి ప్ర భుత్వం ఎస్‌ఎపిని ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ల కోసం ఈ రైతు ఉద్యమం ప్రారంభమైందని అన్నారు. పంటలకు ధర లేకపోతే ఓట్లు వుండవని, యుపి ప్రజలు మోడీ,షా, యోగిలను ఇకపై సహించరని అన్నారు. జనవరి 28 రాత్రి జరిగిన ఘటనను మర్చిపోవద్దని, ఆ రాత్రి దేశ ప్రజలను ఒక్కటి చేసిందని, ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే అల్లర్లు జరుగుతాయని అన్నారు. కేంద్రం ముస్లిం, హిందువులను వేరు చేయాలని చూస్తోందని.. కానీ మనం ఐక్యం చేయడం గురించే మాట్లాడతామని చెప్పారు.