ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి: జో బైడెన్

అమెరికాలోని క్యాపిటల్ భవన్ వద్ద ట్రంప్ మద్దతుదారులు వ్యవహరించిన తీరుపై ఆ దేశ తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. విల్మింగ్టన్‌లో మీడియాతో మాట్లాడిన  ఆయన దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఆధునిక కాలంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు.

ఆందోళన సందర్భంగా కనిపించిన దృశ్యాలు అమెరికాను ప్రతిబింబించవని, ఇది దేశద్రోహమేనని అన్నారు. ఆందోళనకారులు వెనక్కి వెళ్లి ప్రజాస్వామ్యం ముందుకు సాగేలా చూడమంటూ ట్రంప్‌ను కోరారు. ట్రంప్ మద్దతుదారుల కారణంగా చట్టసభ సభ్యులు ప్రమాదంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోపక్క, వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల నిరసనపై అమెరికాలో కలకలం రేగింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదని భారత ప్రధాని మోదీ అన్నారు. కాగా, భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ట్రంప్ మద్దతుదారులు ప్రయత్నించడంతో జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృతి చెందింది.