వేల సంఖ్యలో మెసేజ్‌లు.. స్పందించలేకపోతే క్షమించండి: సోనూ సూద్

కరోనా కష్ట కాలంలో కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలిచి తన ఆపన్న హస్తం అందించిన నటుడు సోనూ సూద్. ఆపదలో ఉన్నవారికి, సహాయం అడిగిన వారికి నేనున్నానంటూ తన సేవలను నిరంతరం అందిస్తున్నాడు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా సోనూసూద్‌కు తమ సమస్యలను తెలియజేస్తున్నారు. వీలైనంత మందికి సోనూ సహాయం చేస్తున్నాడు.

ఈ మేరకు సోనూ సోషల్ మీడియా ఖాతాలకు వేల సంఖ్యలో మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ విషయాన్ని సోనూ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. 19000 ఎఫ్‌బీ మెసేజ్‌లు.. 4812 ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు.. 6741 ట్విటర్ మెసేజ్‌లు.. సహాయం కోరుతూ ఈ ఒక్క రోజు వచ్చిన మెసేజ్‌లు ఇవి. సగటున ప్రతిరోజూ ఇంతే స్థాయిలో మెసేజ్‌లు అందుకుంటున్నా. ఇందులో ప్రతి ఒక్కరి మెసేజ్‌కు స్పందించడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ఎవరి మేసేజ్‌కైనా స్పందించలేకపోతే క్షమించండని సోనూ ట్వీట్ చేశాడు.