హైదరాబాద్‌లో పురాతన భవనాలకు పొంచి ఉన్న ముప్పు

తెలంగాణలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు అప్రమత్తం అయిన అధికారులు ఇప్పటికే పలు వరద బాధిత ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇదే విధంగా హైదరాబాద్‌లో కూడా పురాతన భవనాలకు ముప్పు పొంచి ఉన్నందున అక్కడ నివసిస్తున్న వారిని సైతం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నగరంలోని పాత భవనాల్ని పరిశీలిస్తున్నారు.

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పలు పురాతన ఇళ్ల గోడలు కూలిపోయాయి. బాగ్‌లింగంపల్లిలో ప్రమాదకరంగా ఉన్న అపార్ట్‌మెంట్లను ముషీరాబాద్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ పావని, సెక్షన్‌ ఆఫీసర్‌ రాందాస్‌, సిబ్బంది జగన్‌, అనిల్‌, రాజయ్య, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డితోపాటు పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ పావని మాట్లాడుతూ నియోజకవర్గంలోని రాంనగర్‌, అడిక్‌మెట్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, కవాడిగూడ, గాంధీనగర్‌ డివిజన్లలో శిథిలావస్థలో ఉన్న 25 ఇళ్ల యజమానులు వీటిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు.

వర్షాల వల్ల కవాడిగూడలో రెండు పురాతన ఇళ్లు, రాంనగర్‌ నుంచి వీఎస్టీ వెళ్లే మెయిన్‌ రోడ్‌లో ఓ కంపెనీ ప్రహరీ కూలిపోయిందని తెలిపారు. గతంలో భాగ్యనగరంలో పాత భవనాలు కూలి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో అధికారులు అప్రమత్తమై పురతాన ఇళ్లకు, పాత భవనాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.