తిరుపతి: రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి

కరోనా బాధితులకు సరైన సమయానికి ఆక్సిజన్ అందక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో కనీసం 11 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. సోమవారం రాత్రి 8:15 నుంచి 8:30 గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య ఏర్పడినట్లు తెలిపారు. దాదాపు 1000 మందికి చికిత్స జరుగుతోందన్నారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో ఐసీయూలోని బాధితులు ఊపిరాడక అల్లాడారు. అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యులు సీపీఆర్‌ చేశారు. బంధువులు కూడా బాధితులకు గాలి ఆడేందుకు అట్టముక్కలతో విసిరారు. అయినా, ఆక్సిజన్ అందరక 11 మంది కన్నుమూశారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా వచ్చిందని, ఆక్సిజన్ ఆలస్యం కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.

సీఎం జగన్ దిగ్భ్రాంతి

ఈఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌ అందించిన వివరాలను సీఎం జగన్ కు సీఎంఓ అధికారులు వివరించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఆపై పూర్తిస్థాయి నివేదిక తనకు అందించాలని సీఎం ఆదేశించాడు. ఘటనకు దారి తీసిన కారణాలను గుర్తించి, మళ్లీ పునరావృతం కాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆస్పత్రి వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కోరారు. అవసరమైన సాంకేతిక సంస్థల సహాయం తీసుకుని రుయా లాంటి ఘటనలు తలెత్తకుండా చూడాలన్నారు. ఆక్సిజన్‌ సేకరణ, సరఫరాలపైనే కాకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వ్యవస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.