చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

కేబుల్‌ బ్రిడ్జిపై సందర్శకుల తాకిడి పెరుగడంతో రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఎవరూ ఆ మార్గంలో రాకూడదని సూచించారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై సమీక్ష జరిపారు.

ఈ మార్గం ఇటీవలే తెరుచుకోవడంతో విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దీంతో దుర్గం చెరువు వద్ద పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది. ఎక్కువ మంది వస్తూ ఫొటోలు దిగుతూ.. ఆ ప్రాంతం అంతా కలియ తిరుగుతున్నారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చే వాహనాల కారణంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. దీనికి తోడు పార్కింగ్ సమస్య కూడా ఉండటంతో ఈ నేపథ్యంలోనే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల పాటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, నగరంలో హైటెక్ సిటీ వైపు వెళ్లే వారి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.