గాంధీ మహాత్ముడికి నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా యావత్ భారతంతో పాటు ప్రపంచదేశాలు మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ.. అహింసే ఆయుధంగా స్వాతంత్ర్య పోరాటం చేసి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి దేశానికి విముక్తి కల్పించిన జాతిపితకు ఘనంగా నివాళి అర్పిస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ నేత ఆజాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాళి అర్పించారు. పుష్పాలతో అంజలి ఘటించి.. నమస్కరించారు. ఘనంగా నివాళులర్పించారు. యువత మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని కొనియాడారు.

నేడు మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి సైతం కావడంతో విజయ్‌ఘాట్‌ వద్ద ఆయనకు ప్రధాని మోదీతోపాటు లాల్‌బహుదూర్‌ శాస్త్రి కుమారుడు అనిల్‌ శాస్త్రి సైతం అంజలి ఘటించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు సైతం మహాత్మా గాంధీకి, లాల్‌బహుదూర్‌ శాస్త్రికి నివాళులర్పించారు.