‘టీఎస్ బీపాస్’ బిల్లు పాస్.. ఇక పై ఆన్ లైన్లో నిర్మాణ అనుమతులు

సీఎం కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త రెవిన్యూ యాక్ట్ పై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి బిల్లు పాస్ చేయించారు. ఈ చట్టం అమలులోనికి వస్తే రైతులకు, సామాన్యులకు ఎంతో మేలు కలుగనుంది. లంచాల వ్యవస్థగా మారిన రెవిన్యూ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడంతో ప్రజల నుంచి పెద్దఎత్తున హర్ష భావం వ్యక్తం అయింది. అదేవిధంగా తెలంగాణలో ప్రతీ ఇంచును అధికారులు సర్వే చేసి ఇకపై అక్రమాలు జరుగకుండా చూస్తామంటూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.

ఇక కేసిఆర్ బాటలోనే ఆయన తనయుడు కేటీఆర్ కూడా నడుస్తూ. మున్సిపల్, ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ శాఖపై దృష్టిసారించారు. భవన నిర్మాణ అనుమతులు వేగవంతం అయ్యే విధంగా ఉండేలా ‘టీఎస్ బీపాస్’ తీసుకు రాబోతున్నారు. ఆన్ లైన్లోనే భవన నిర్మాణాలను అనుమతులిచ్చేలా మున్సిపల్ శాఖ సన్నహాలు చేస్తోంది. ‘టీఎస్ బీపాస్’ను అమల్లోకి తీసుకురానుంది. ఇది అమల్లోకి వస్తే ఇకపై ఎవరూ కూడా కార్యాలయాల చుట్టూ అనుమతుల కోసం తిరగాల్సిన అవసరం ఉండనే ఉండదు.

తాజాగా మంత్రి కేటీఆర్ తన ట్వీట్టర్లో ‘టీఎస్ బీపాస్’లోని కీలక అంశాలను వెల్లడించారు. 600చదరపు గజాల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్లలోని అన్ని లేఅవుట్లు లేదా భవనాలకు 21రోజుల్లోపు 10మీటర్ల ఎత్తుకు సింగిల్ విండో అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. స్వీయ ధృవీకరణ ఆధారంగానే అనుమతి లభిస్తుందని కేటీఆర్ స్పష్టం చేసారు. 75చదరపు గజాల ప్లాట్లలో 7మీటర్ల ఎత్తుతో నివాస భవనాలకు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.

75 చదరపు గజాల పైన మరియు 600చదరపు గజాల (10 మీటర్ల ఎత్తు వరకు) ప్లాట్లలో నివాస భవనాలకు స్వీయ ధృవీకరణ ద్వారా తక్షణ అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణ కోసం కలెక్టర్ అధ్యక్షతన డిస్టిక్ లెవల్ టీఎస్ బీపాస్ కమిటీ ఉంటుందని తెలిపారు. ఈ విధానంలో భవన నిర్మాణాల కోసం లబ్ధిదారులు ఈజీగా నమోదు చేసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు. ఈ విధానం విజయవంతమైతే మాత్రం లబ్ధిదారులకు చాలా మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.