కృష్ణానదిపై మరో రెండు కొత్త బ్యారేజ్‌లు

ప్రకాశం బ్యారేజ్ దిగువన రెండు కొత్త బ్యారేజ్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా డెల్టా ను పునరుద్ధరించేందుకు మరియు కృష్ణా నీటి సద్వినియోగానికిగానూ ఈ రెండింటి లక్ష్యంతో కృష్ణా నదిపై మరో రెండు బ్యారేజ్ ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రెండు బ్యారేజ్ లు ప్రకాశం బ్యారేజ్ కు దిగువన నిర్మితం కానున్నాయి.

ఏపీ కృష్ణాడెల్టా ను పునరుద్దరించ వలసి ఉండగా.. డెల్టా చివరి వరకూ చాలా సందర్భాల్లో నీరు అందక నిర్వీర్యమైపోతోంది. అందుకే ప్రకాశం బ్యారేజ్ కు దిగువన మరో రెండు చిన్న చిన్న బ్యారేజ్ లు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ లో దీనికి ఆమోదం కూడా లభించింది. ఇప్పుడు ఆ బ్యారేజ్ ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ దీనికి సంబంధించిన తొలిదశ పాలనా అనుమతులు జారీ చేశారు.

ఈ రెండు బ్యారేజ్ లలో ఒకటి ప్రకాశం బ్యారేజ్ కు 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరంకు..గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మద్యన నిర్మితం కానుంది. ఇక రెండవది..బ్యారేజ్ కు 62 కిలోమీటర్ల దిగువన మోపిదేవి మండలం బండికొల్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం మధ్యన నిర్మించనున్నారు.