త్యాగమూర్తి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి

దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో.. అటువంటి వారిలో మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందలు వేల కోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజులలో మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేసినప్పటికీ చరమాంకంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన శ్రీ వాజ్‌పేయి గారు గురించి ఏమని చెప్పాలి. అందుకేనేమో ఆయన భారతరత్నగా మనందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని చవిచూసిన శ్రీ వాజ్‌పేయి గారు దేశమే జీవితం అనుకొని బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన పాత్రికేయునిగా పని చేస్తూనే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన నిర్వర్తించిన పదవులు ఎన్నో. జనతా ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా తన ప్రతిభను చాటుకున్నారు. పార్లమెంటేరియన్ గా ఆయన సుదీర్ఘంగా పని చేశారు. బిజెపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా ఆయన హయాంలో మన దేశం ఎన్నో విజయాలను చవిచూసింది. రాజస్థాన్ ఎడారిలో అణుపరీక్షలు జరిపి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా నిలిపింది ఆయనే. ప్రైవేటు రంగాన్ని పటిష్టపరచటం, దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు రవాణా వ్యవస్థను విస్తరించటం ఆయన సాధించిన విజయాలే. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఆయన వాగ్దాటి పార్లమెంటును అబ్బురపరిచేది. విలక్షణమైన ఆయన కవితా ఝరి పామరులను సైతం ఆకట్టుకునేది. ఇంతటి అరుదైన నాయకుడి వర్ధంతి సందర్భాన ఆ మహా నాయకునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నా పక్షాన, జనసేన పక్షాన నివాళులు అర్పిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.

కేంద్ర కార్యాలయంలో నివాళులు

మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ వాజపేయి గారికి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.