శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దురదృష్టకరం: గురాన అయ్యలు

విజయనగరం: సీఎం జగన్ విజయనగరం పర్యటన సందర్భంగా శాంతియుతంగా జనసేన శ్రేణులు చేస్తున్న నిరసనలను పోలీసుల సాయంతో రాష్ట్ర ప్రభుత్వం అణిచివేయడం దురదృష్టకరమని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వైసీపీ ప్రభుత్వ చర్యలు నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. పాలవలస యశస్వి, పడాల అరుణ, తుమ్మిలక్ష్మీ, మాతా గాయిత్రి తదితర జనసేన మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మహిళల పట్ల జగన్ కి వున్న గౌరవానికి ఈ అరెస్టులు నిదర్శనమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత మాటలతో మభ్యపెడుతున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న నేతలను అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయడం చేతకాక జనం కోసం పోరాటం చేస్తున్న వారిని అణచివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ పాలకులకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.