కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ తొలిదశ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ లేఖ రాశారు. ఓ వ్యక్తికి  కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లలో ఏదో ఒకటే ఇవ్వాలని, ఏ వ్యాక్సిన్ ను మొదటి డోసుగా తీసుకుంటారో, రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లు 18 ఏళ్లు, అంతకు పైబడినవారికి మాత్రమే ఇవ్వాలని వెల్లడించారు.

కాగా, ఏపీలో తొలి విడతలో 3.87 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొదటగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. అందుకోసం 332 ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టీకాల పంపిణీ చేపట్టనున్నారు. ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి దశలో వ్యాక్సిన్లు ఎవరెవరికి ఇవ్వాలన్నదానిపై అధికారులు కొవిన్ యాప్ లో సమాచారాన్ని నిక్షిప్తం చేశారు.