UP polls : ప్రియాంక గాంధీ యుపి ముఖ్యమంత్రి కానున్నారా.. !

ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా యుపి ముఖ్యమంత్రి కానున్నారా.. అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి విషయంపై తుది నిర్ణయం ప్రియాంకదేనని మాజీ కేంద్రమంత్రి, సీనియర్‌ నేత సల్మాన్‌ కుర్షీద్‌ స్పష్టం చేశారు. రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రియాంక నేతృత్వంలో కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగుతుందని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలా., వద్దా అనేది ఆమె నిర్ణయించుకుంటారని అన్నారు. కాగా, శనివారం కాంగ్రెస్‌ సోషల్‌మీడియా విభాగం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీని ఏకగ్రీవం చేస్తూ.. ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సల్మాన్‌ కుర్షీద్‌ స్పందిస్తూ.. తమ పార్టీకి అధ్యక్షులు ఉన్నారని.. మరో అధ్యక్షులు అవసరంలేదని అన్నారు. తమ అధ్యక్షుల పట్ల తాము సంతృప్తిగానే ఉన్నామని.. పరిస్థితి చూస్తుంటే ఇతర వర్గాలు సంతృప్తికరంగా ఉన్నట్లు కనిపించడం లేదని అన్నారు. ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ మహిళా కాంగ్రెస్‌ కూడా ఇదేవిధంగా రాహుల్‌గాంధీని అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.