వ్యాక్సిన్‌ సరఫరాలో అమెరికా హామీ అభినందనీయం: మోడీ

భారత్‌కు సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. అందులో భాగంగా తొలి 2.5 కోట్ల డోసుల వ్యాక్సిన్లను అందించనుంది. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌… ప్రధాని మోడీకి ఫోన్‌లో తెలిపారు. అదేవిధంగా మెక్సికో అధ్యక్షుడు అండ్రూస్‌ మాన్యుల్‌ లోఫెజ్‌ అబోర్డర్‌్‌, గుటెమలా అధ్యక్షుడు అలెగ్జాండ్రో జియామెట్టై, కరెబియన్‌ కమ్యూనిటీ చైర్మన్‌, ప్రధాని కైత్‌ రౌలిలతో కూడా ఆమె సంభాషించారు. గ్లోబల్‌ వ్యాక్సిన్‌ షేరింగ్‌ స్ట్రాటజీలో భాగంగా భారత్‌తో పాటు ఈ దేశాలకు కూడా వ్యాక్సిన్లు అందిస్తోంది. జూన్‌ చివరి నాటికి 8 కోట్ల డోసులు అందించేందుకు బైడెన్‌ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహమ్మారి, దాని అత్యవసర పరిస్థితులు, ప్రజారోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించడం, టీకాలు వీలైనన్నీ దేశాలకు అందించేలా తమ పాలనా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. గ్లోబల్‌ వ్యాక్సిన్‌ షేరింగ్‌లో భాగంగా తొలి విడత 2.5 కోట్ల డోసులను అందించే ప్రణాళికలపై విదేశీ నేతలతో కమలా హారీస్‌ చర్చించారని సీనియర్‌ సలహాదారు, అధికార ప్రతినిధి నేత సైమన్‌ శాండర్స్‌ తెలిపారు.

దీనిపై ప్రధాని ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నందుకు అభినందనలు తెలిపిన ఆయన.. యుఎస్‌లో ఉంటున్న భారత సంతతికి మద్దతుగా నిలుస్తున్నందుకు కమలాహారీస్‌కు ధన్యవాదాలు తెలిపారు.