11 మందితో ఉత్తరాఖండ్ మంత్రివర్గ విస్తరణ

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారంనాడు 11 మంది ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా తీసుకున్న మంత్రివర్గంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బన్సీధర్ భగత్‌తో పాటు, సత్పాల్ మహరాజ్, హరక్ సింగ్ రావత్, సుబోధ్ యునియాల్, యష్‌పాల్ ఆర్య, ధన్ సింగ్ రావత్, బిషన్ సింగ్ ఛుఫల్, అరవింద్ పాండే, గణేష్ జోషి, రేఖ ఆర్య, స్వామి యతీశ్వరానంద ఉన్నారు.

త్రివేంద్ర సింగ్ రావత్‌ నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్ఠానం ఆయనను ఇటీవల సీఎం పదవి నుంచి తప్పించడంతో గత బుధవారంనాడు కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. శక్రవారంనాడు ఆయన మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 70 మంది సభ్యుల ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీకి 56 మంది సభ్యులు ఉన్నారు.