పరిపాలనా రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి…శంకుస్థాపన త్వరలోనే: బొత్స

ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పరిపాలనా రాజధానికి శంకుస్థాపన చేస్తాం. విశాఖ పరిపాలనా రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి శరవేగంగా జరగనుంది. మూడు రాజధానులతో పరిపాలనా వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందనున్నాయి. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో కూడా లెజిస్లేటివ్‌ కేపిటల్‌ ఉంటుంది కనుక ఆ ప్రాంతమూ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వారు ఆవేదన చెందాల్సిన పనిలేదన్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటున్నందున రాయలసీమ జిల్లాలూ అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ఇలా మొత్తం 13 జిల్లాలు అభివృద్ధి చెందేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంచి ఆలోచనతో మూడు రాజధానుల ద్వారా పరిపాలనా వికేంద్రీకరణకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.