నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్‌

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శనివారం నుంచి టీకాలు వేయనున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికా, యూకేతో పాటు ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేయడంతో.. ఇప్పటికే విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు ఖరారు చేసుకున్న రాష్ట్ర విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వారికి టీకాలు వేయాలని నిర్ణయించింది. టీకాలు వేసేందుకు శుక్రవారం పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురాగా.. తొలిరోజు మూడువేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. కేటగిరిలో రోజుకు 350 మందికి టీకాలు వేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. శనివారం టీకాలు తీసుకోనున్న 350 మంది విద్యార్థులకు మెస్సేజ్‌లు పంపారు. విడుతల వారీగా విద్యార్థులందరికీ మెస్సేజ్‌లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.

మరో వైపు విద్యార్థుల సౌలభ్యం కోసం రెండో టీకా పొందే గడువును సైతం ప్రభుత్వం సడలించింది. తొలిడోసు తీసుకున్న నాలుగు వారాలకే రెండో డోసు పొందడానికి అవకాశం కల్పించింది. హైదరాబాద్‌ నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ టీకా పంపిణీ కొనసాగనుంది. టీకా వేయించుకునేందుకు ప్రతి విద్యార్థి తన మొబైల్‌కు వచ్చిన సంక్షిప్త సందేశాన్ని, ఓటీపీని తప్పక చూపించాల్సి వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

పాస్‌పోర్టుతో పాటు వీసాను వెంట తెచ్చుకోవాలి, వీసా లేకపోతే.. ఏ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారో ఆ సంస్థలో ప్రవేశపత్రాన్ని చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. 18-44 ఏళ్ల మధ్య వయస్కులైన విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఇక్కడ టీకా వేయనుండగా.. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎక్కడైనా పోలీసులు ఆపితే.. మొబైల్‌లో ఉన్న సంక్షిప్త సందేశాన్ని చూపిస్తే అనుమతి ఇస్తారని అధికారులు తెలిపారు.