వీసీ,అధ్యాపక పోస్టుల భర్తీ: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తాo అంటూ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీలో సభ్యులు అధ్యాపక నియామకాల గురించి ప్రశ్న అడగగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ  ఇచ్చారు. రాష్ట్రంలో గల వర్సిటీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని స్పష్టం చేశారు. త్వరలో వర్సిటీలకు వీసీలు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ బిల్లుపై చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జవాబిచ్చారు.

వీసీ/ అధ్యాపక నియామకాలకు సంబంధించి అనుమతులు ఇచ్చి చాలా రోజులవుతుందని మంత్రి తెలిపారు. కానీ న్యాయపరమైన సమస్య రావడంతో ఆలస్యం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చదవాలని కోరుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని తెలిపారు. విద్యార్థుల నుంచి వస్తోన్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు వర్సిటీల ప్రతిపాదన తీసుకొచ్చామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.