భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించిన వెదురుకుప్పం ఎస్సై

  • నకిలీ ఎఫ్ఐఅర్ ఎవరి కోసం సృష్టించారు
  • ఫోర్త్ ఎస్టేట్ ను ఎందుకు అగౌరవపరిచారు..?
  • వారినెందుకు కేసులో ఇరికించారు..?
  • పత్రికా ప్రతినిధులు లేకుండా పరిపాలన సాగించగలరా..?
  • ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అవినీతి బంధువులపై కేసు పెట్టే ధైర్యం , దమ్ముందా ..?
  • ఇందులో కనపరచిన అత్యుత్సాహానికి
  • వెదురుకుప్పం ఎస్సైనీ సస్పెండ్ చేయాలి
  • జిల్లా ఎస్పీ వెంటనే స్పందించాలి
  • జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న

జీడీ నెల్లూరు: వెదురుకుప్పం మండలం, పెరుమాళ్ళ పల్లిలో ఒక వ్యక్తి మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది అని వాట్సప్ గ్రూప్ లో పత్రికా ప్రతినిధులు పోస్ట్ చేసినందుకు, ఒక వేళ నాటు సారా తాగి ఉండి అతని మరణించి ఉంటే అతనికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జనసేన తరఫున డిమాండ్ చేసినందుకు, వివరాలు ఇవ్వకపోగా వెదురుకుప్పం మండల ఎస్సై లోకేష్ నాపై, నలుగురు విలేకరులపైన అక్రమంగా కేసులు బనాయించారని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డా. యుగంధర్ పొన్న తెలిపారు. మృతి చెందిన వ్యక్తి అల్లుడు ఫిర్యాదు ఇచ్చారని తప్పుడు కేసు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఫిర్యాదు దారుడు తాను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని ఎస్పీకి తెలియజేశారు. నకిలీ ఎఫ్ఐఅర్ ఎవరి కోసం సృష్టించారనీ, అలాంటి అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19/1 ఏ ప్రకారం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది అనే విషయాన్ని చాటి చెబుతుందనీ తెలియజేశారు. పోలీసులు అధికారులు ఫోర్త్ ఎస్టేట్ను అగౌరవపరిచారనీ వారినెందుకు కేసులో ఇరికించారనీ ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టంలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయని, ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తి మరణిస్తే సాయంత్రం నాలుగున్నర గంటల పైన భౌతిక కాయాన్ని పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ఏడున్నర గంటలలోపు ఇంటికి తీసుకొచ్చిన దాఖలాలు ఇంతవరకు జరగలేదని ఎద్దేవా చేసారు. ఈ విషయంలో పోలీస్ అధికారులు చూపిన అలసత్వానికి, అప్రజాస్వామిక చర్యలకు, నిరుపేదలను మోసం చేసే విధంగా ప్రయత్నించి నందుకు, వెదురుకుప్పం ఎస్సై, సీఐ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న పత్రికా ప్రతినిధులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మీరంటే గౌరవమనే విషయాన్ని తెలుసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టినా, గౌరవ కోర్టు ప్రజల కోసం పనిచేసేవారికి అండగా ఉంటుందని హితవుపలికారు. పత్రికా ప్రతినిధులు లేకుండా మీరు సజావుగా పరిపాలన సాగించగలరా అని అడిగారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ తన బంధువులు అవినీతి చేస్తే వారిని దూరం పెట్టాననీ చెప్పిన దాన్ని బట్టి, ఆ బంధువులైన అవినీతిపరుల మీద కేసు పెట్టే ధైర్యము దమ్ము వెదురుకుప్పం ఎస్ఐకి, సీఐ కి ఉందా అని ప్రశ్నించారు. ఇందులో కనపరచిన అత్యుత్సాహానికి వెదురుకుప్పం ఎస్సైనీ సస్పెండ్ చేయాలనీ, జిల్లా ఎస్పీ ఈ విషయంలో వెంటనే స్పందించాలనీ ఈ సందర్భంగా డా. యుగంధర్ పొన్న డిమాండ్ చేసారు.