మరో సీక్వెల్ కి రెడీ అవుతున్న వెంకటేష్!

మలయాళంలో ఎక్కువగా మంచి కథా చిత్రాలు వస్తుంటాయి. అక్కడి స్టార్ హీరోలు సైతం అలాంటి విభిన్న తరహా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా కొన్నేళ్ల క్రితం మోహన్ లాల్ హీరోగా వచ్చిన చిత్రమే ‘దృశ్యం’. కొత్త కథా సంవిధానంతో రూపొందిన ఈ చిత్రం అక్కడ మంచి హిట్ అవడంతో తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ప్రేక్షకులను అది బాగా ఆకట్టుకుని బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.

ఈ క్రమంలో తాజాగా మలయాళంలో ‘దృశ్యం 2’ని నిర్మించారు. మోహన్ లాల్ కథానాయకుడుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న కేరళలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ రీమేక్ హక్కులను ఇప్పటికే పొందింది. ఈ రీమేక్ లో కూడా వెంకటేష్ కథానాయకుడుగా నటిస్తారు. ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఎఫ్ 3’ సినిమా పూర్తయ్యాక ఇది సెట్స్ కు వెళుతుందని తెలుస్తోంది. మలయాళంలో ‘దృశ్యం 2’కి లభించే ఆదరణను బట్టి తెలుగు రీమేక్ కి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు.