సీఎం కేసీఆర్ విధానాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన విజయశాంతి

సీఎం కేసీఆర్ విధానాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందనదానికి తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా స్పందించి విజయశాంతి.. చినుకు పడితే చాలు జలమయం అయ్యే హైదరాబాద్‌ను ఎలాగూ కాపాడలేకపోయారని, ఇప్పుడు ప్రభుత్వ చేతగాని తనానికి వరంగల్ కూడా బలైపోయిందని విమర్శించారు. ఇక భూకబ్జాలను ఆపలేక రెవెన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం ఘటనే చెబుతోందని దుయ్యబట్టారు.

కోవిడ్ చికిత్సా కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా అక్కడ ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని ఆరోపించారు. కోవిడ్ చికిత్సా వ్యవస్థ ఇటు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కుప్పకూలిపోయిందని అన్నారు. అందుకు హైకోర్టు వేసిన మొట్టికాయలే సాక్ష్యం అని ఆమె పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పనితీరుపై వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల అసంతృప్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు నీట మునిగి అన్నదాతలు ఆవేదనలో ఉంటే కనీసం వారిని పట్టించుకునే పరిస్థితి లేదని ప్రభుత్వం తీరుపై ఆమె మండిపడ్డారు.