రాజరాజేశ్వరి దేవి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారి రాజ రాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంతో అభయ ముద్రతో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని కనులారా వీక్షించి తరిస్తున్నారు భక్తులు. సాయంత్రం అమ్మవారిని హంస వాహనంపై ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు అర్చక స్వాములు.

ఈ రోజున నిర్వహించే తెప్పోత్సవ సేవకు అంతరాయం కలిగింది. కృష్ణానదికి వరద పోటెత్తుతున్నందున గంగా సమేత దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులను హంస వాహనంపై ముమ్మారు నదీ విహారం చేయించే ప్రక్రియను రద్దు చేశారు.

అక్టోబర్ 17 శనివారం బెజవాడ ఇంద్రకీలాద్రిపై మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో (ఆదివారం) ముగియనున్నాయి. మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. నేడు దసరా కావడంతో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా… అందుకు తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. దర్శనానికి వచ్చే భక్తులు, భవానీలు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.