16 దేశాలకు వీసా-ఫ్రీ ప్రయాణం

పాస్ పోర్టు ఉన్న భారతీయులు 16 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లాలంటే వారికి వీసాలు అక్కర్లేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలిపారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ లిఖితపూర్వంగా ఈ విషయాన్ని తెలియజేశారు.

అలాగే భారతీయ సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు 43 దేశాలు వీసా ఆన్ అరైవల్, 36 దేశాలు ఈ-వీసా సౌకర్యాలను కల్పిస్తున్నాయి మంత్రి వెల్లడించారు. వీసా-ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్న 16 దేశాల జాబితాలో బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంకాంగ్ ఎస్ఏఆర్, మాల్దీవులు, మారిషస్, మోంట్సెరాట్, నేపాల్, నియు ద్వీపం, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తున్న 43 దేశాల్లో ఇరాన్, ఇండోనేషియా, మయన్మార్ ఉంటే… ఈ-వీసా సౌకర్యం కల్పిస్తున్న 36 దేశాల్లో శ్రీలంక, న్యూజిలాండ్, మలేసియా ఉన్నట్లు మురళీధరన్ తెలిపారు. కాగా, భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి వీసా-ఫ్రీ ప్రయాణం, వీసా ఆన్ అరైవల్, ఈ-వీసా సౌకర్యాన్ని అందించే దేశాల సంఖ్యను మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మురళీధరన్ అన్నారు.