విశాల్ పొలిటికల్ ఎంట్రీ..

తమిళనాడులో మరో హీరో పొలిటికల్ ఎంట్రీకి ఉత్సాహపడుతున్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సమరానికి సై అంటూ ముందుకొస్తున్న సూపర్ స్టార్ రజిని కొత్తపార్టీ వార్తలు తమిళనాట హల్చల్ చేస్తుండగా ఈ యువ హీరో తాను కూడా పోటీకి సిద్ధమంటూ ప్రకటించేశారు. ఆ యువ హీరో మరెవరో కాదు…విశాల్ రెడ్డి.

తెలుగు వాడైనప్పటికీ కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ…అక్కడి సినీ సంఘంలో కీలక భూమిక పోషిస్తూ రాజకీయాలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన ఆర్కేనగర్ అస్సేబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసారు. అయితే, నామినేషన్ ప్రతిపాదించిన పదిమందిలో కొంతమంది ఉపసంహరించుకోవడంతో విశాల్ నామినేషన్ ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దాంతో, అప్పుడు ఆయన పోటీ చేయలేకపోయారు.

తాజాగా తమిళనాట మళ్ళీ ఎన్నికల జాతర త్వరలో రాబోతుండడంతో ఎలాగైనా ఈసారి బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటినుంచే తన అభిమాన సంఘాలతో తరచూ సమావేశమై మంతనాలు సాగిస్తున్నారు.

తాను చెన్నయ్ పరిధిలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకున్న తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇదే విషయాంన్ని ఆయన సన్నిహితులు, అభిమాన సంఘాల ప్రతినిధులు బాహాటంగా చెప్తున్నారు. సో… మరో హీరో కూడా తమిళ రాజాకేయాల్ని రక్తి కట్టించేందుకు రంగంలోకి రాబోతున్నారన్నమాట.