జగన్ రెడ్డి పాపాల్లో వాలంటీర్లు భాగస్వామ్యం కావద్దు

  • వాలంటీర్లను అడ్డం పెట్టుకొని మరోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారు
  • వాలంటీర్ల కష్టాన్ని వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుంది
  • వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలు పతాకస్థాయికి చేరాయి
  • మరోసారి వైసీపీ వస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు
  • వైసీపీకి వాలంటీర్లు సహకరిస్తే చరిత్ర క్షమించదు
  • యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో పవన్ కల్యాణ్ ఉన్నారు
  • జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో పాటూ వైసీపీ నేతలు చేస్తున్న పాపాల్లో వాలంటీర్లు భాగస్వామ్యం కావద్దని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి వాలంటీర్లను కోరారు. వాలంటీర్లకు వందనం పేరుతో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రజలు ఏ పార్టీనో తెలుసుకోవాలంటూ వాలంటీర్లను మంత్రి ధర్మాన ప్రసాద్ ఆదేశించడంపై ఆయన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో ఆళ్ళ హరి మాట్లాడుతూ అధికారం కోసం ఎంతటి అరాచకాలకైనా , ఎలాంటి దుర్మార్గాలకైనా వెనుకాడని వైసీపీ నేతలు ఇప్పుడు వాలంటీర్లను పావులుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఓటు ఎవరికి వేస్తారనేది ప్రజల వ్యక్తిగతమన్నారు. ప్రజల హక్కుని , వ్యక్తిగత స్వేచ్చని కాలరాసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించటం దుర్మార్గమన్నారు. వైసీపీ పాలన బాగుంటే ప్రజలు ఆ పార్టీకే మళ్ళీ పట్టం కడతారని , తమ పాలనపై తమకే నమ్మకం లేక వైసీపీ నేతలు వాలంటీర్లతో బలవంతంగా సర్వే చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో వైసీపీ నేతలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారన్నారు. వాలంటీర్లు కూడా వైసీపీ నేతల దోపిడీని, అవినీతిని గమనించాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఐదు వేల కోసం వాలంటీర్లు తమ జీవితాలను వృధా చేసుకోవద్దంటూ హితవు పలికారు. తమ శ్రమను ప్రభుత్వం దోచుకుంటున్న విషయాన్ని వాలంటీర్లు గుర్తించాలన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే వాలంటీర్లను తొలగిస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. డిగ్రీ, యమ్ టెక్, బీ టెక్ చదుకున్న యువత కూడా తమ భవిష్యత్ ను వలంటీర్ దగ్గరే పరిమితం చేయటం దురద్రుష్టకరమన్నారు. యువతలో ఉన్న నైపుణ్యాలకు తగ్గట్టుగా ఉపాధి కల్పించటానికి జనసేనాని ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నారన్నారు. రాష్ట్ర సంపద అంతా అధికారంలో ఉన్న కొంతమంది దగ్గరే ఉండిపోతుందని, జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సంపదతో యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతారన్నారు. ప్రభుత్వం మారినా వాలంటీర్లకు డోకా ఉండదని ఇంకా ఎన్నో ఉన్నతస్థాయి ఉపాధి మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ నేతలు చేయమన్నట్లు చేస్తే రేపు అధికారం మారితే దాని పర్యవసానం వాలంటీర్లే అనుభవించాల్సి వస్తుందన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి సహకరిస్తే చరిత్ర క్షమించదన్నారు. వాలంటీర్ల ఆర్ధిక స్థోమతని, బలహీనతలను ఆసరా చేసుకుని వారి జీవితాలతో ఆడుకోవద్దని వైసీపీ నేతలను ఆళ్ళ హరి హెచ్చరించారు.