రికార్డు స్థాయిలో ఓటు వేయాలి.. ప్రధాని పిలుపు

పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. యువ, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఎనిమిది విడుతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు దశల పోలింగ్‌ పూర్తి కాగా.. శనివారం నాలుగో దశలో 44 నియోజకవర్గాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.

కూచ్ బెహర్, అలీపుర్దువార్, సౌత్ 24 పరగణాలు, హౌరా, హూగ్లీ జిల్లాల పరిధిలోని 44 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 373 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 1,15,81,022 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఇందులో 2,63,016 మంది మొదటిసారిగా ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతున్న వాటిల్లో అతి చిన్న నియోజకవర్గం బల్లి. ఇక్కడ కేవలం 1,76,001 ఓటర్లు ఉన్నారు. అతిపెద్ద నియోజకవర్గం చుంచురా కాగా.. ఇక్కడ 3,13,701 మంది ఓటర్లు ఉన్నారు.