వారాహి… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అని ప్రకటించారు. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు.
దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు… వారాహి
ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు… ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.

వారాహి విశేషాలు:

                                                          
* ప్రత్యేక లైటింగ్… ఆధునిక సౌండ్ సిస్టమ్స్
వారాహి.. వాహనాన్ని ప్రత్యేక భద్రత చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు చేసిన సందర్భంలో విద్యుద్దీపాలు ఆర్పి వేసి కక్ష సాధింపు చర్యలకు దిగే సంస్కృతినీ చూస్తున్నాం. ఇటీవల విశాఖపట్నం పర్యటన సందర్భంలో వీధి దీపాలు ఆర్పివేసిన విషయం విదితమే. వారాహి వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. వాహనం నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించే సందర్భంలో – లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు. వేల మందికి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వినిపించే విధంగా ఈ సౌండ్ సిస్టం ఉంటుంది. వారాహి.. వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్ కి రియల్ టైంలో వెళ్తుంది. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఎదురయిన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు తీసుకున్నారు.
* కొండగట్టులో పూజలు
వాహనం లోపల పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునే ఏర్పాటు ఉంది. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరవచ్చు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. తదుపరి ఈ వాహనం పర్యటనకు వస్తుంది.