సామాన్యుడి పక్షాన గళం… జనసేన

• స్వార్థ రాజకీయాలకు అతీతంగా సైద్ధాంతిక విలువలకు కట్టుబడి ప్రయాణం
• యువతకు ఉపాధి, మహిళలకు రక్షణ, రైతుకు సాయం జనసేన లక్ష్యాలు
• తెనాలిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.. భావితరాలకు ఆదర్శవంతంగా నిలబడాలి.. సామాన్యుడి తరఫున గళం విప్పాలన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు దశాబ్దం క్రితం జనసేన పార్టీని స్థాపించినట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం స్వార్ధ రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సైద్ధాంతిక విలువలతో జనసేన అడుగులు వేస్తోందని తెలిపారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఉన్న పార్టీలను ఎదుర్కొంటూ, పోరాటాలు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లిన తీరు అద్భుతమన్నారు. జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్సవాన అలాంటి స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగిస్తున్న పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసైనికులకు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టు తెలిపారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడులను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంపై పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. “ఒక పార్టీగా దశాబ్దకాలంగా చేస్తున్న పోరాటాన్ని ప్రజలు మరచిపోరు. స్థానిక ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో బలంగా నిలబడ్డాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమయాభావ పరిస్థితుల వల్ల నియోజకవర్గాల వారీగా ఆవిర్భావ వేడుకలు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి జనసైనికుడు, వీర మహిళ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ, బీజేపీలను సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్లాలి. దేశానికి శ్రీ మోదీ గారి నాయకత్వ ఆవశ్యకతను శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. యువతకు ఉపాధి, మహిళలకు రక్షణ, రైతుకు సాయం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే అంశాల మీద దృష్టి సారించే విధంగా రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేద్దాం” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.