ఆరోగ్యాన్ని చెడగొట్టే పరిశ్రమలు మనకు వద్దు

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో దివీస్ బాధిత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న తుని నియోజకవర్గ ప్రజలకు సంఘీభావం ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆరోగ్యం చెడగొట్టే పరిశ్రమలు మనకొద్దు అని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

“కాలుష్యం దృష్ట్యా దివీస్ పరిశ్రమ వద్దని నాడు మీరే డిమాండ్ చేశారు. అలాంటి పరిశ్రమకు ఇప్పుడు మీరే అనుతులు ఇస్తున్నారు. దివీస్ పరిశ్రమ నుంచి పెద్ద మొత్తంలో కాలుష్య జలాలు వస్తాయి. పరిశ్రమల కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్నే కాదు మత్స్య సంపదను కూడా నాశనం చేస్తుంది. పర్యావరణాన్ని దెబ్బతీసే పరిశ్రమలు ఎందుకు? ప్రభుత్వం చర్యలు తీసుకోదలిస్తే కాలుష్య జలాలను శుద్ధి చేసే విధానాలను ప్రోత్సహించాలి.

మీ లాభాల వేటలో పేద ప్రజలను రోడ్డుమీదకు తెస్తున్నారు. కాలుష్య పరిశ్రమలు తెస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? సామాజిక ప్రభావం అంచనా వేయకుండానే పరిశ్రమలకు భూములు ఇస్తారా? దివీస్ పరిశ్రమకు 690 ఎకరాలు ఇచ్చారు… వచ్చిన ఉద్యోగాలు ఎన్ని?” అని ప్రశ్నించారు.

“పరిశ్రమ కాలుష్యం మత్స్య సంపదను నాశనం చేయదని దివీస్ యాజమాన్యం చెప్పాలి. కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి వ్యాధులు రావని హామీ ఇవ్వాలి. కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులకు ఎవరు బాధ్యత వహిస్తారు? అమాయక ప్రజలపై కేసులు పెట్టవద్దని  కోరుతున్నాం. 36 మందిపై నమోదు చేసిన కేసులు వెనక్కి తీసుకోవాలి” అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడు ప్రశ్నిస్తాం అని స్పష్టం చేశారు. సిద్ధాంతాలతోనే రాజకీయాలు చేస్తాం… సిద్ధాంతాల కోసమే పోరాడుతాం అని ఉద్ఘాటించారు. ప్రజలు తనకు ఓట్లు వేయకున్నా సైద్ధాంతిక బలంతోనే నిలబడ్డానని జనసేనాని వెల్లడించారు. తనకు ఆస్తులు, అధికారం అక్కర్లేదని వివరించారు.