జీ 20 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మద్దతు కొనసాగిస్తాం

కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేసే దిశగా పలు దేశాలు ప్రారంభించిన మద్దతు చర్యలను ముందస్తు ఉపసంహరణకు తాము వ్యతిరేకమని జి20 దేశాలు ప్రకటించాయి. ఆదివారం జి20 సదస్సు ముగింపు సమయంలో దేశాది నేతలు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను పర్యవేక్షించడానికి, పరిష్కరించడానికి, బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని అన్నారు.

ఈ సదస్సుకు ప్రధాని మోడీ కూడా హాజరైన సంగతి తెలిసిందే. ప్ర‌పంచం ఆయరారోగ్యాల‌తో విల‌సిల్లాలంటే దేశాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల్సిన అవ‌స‌రం క‌చ్చితంగా ఉంద‌ని ప్ర‌ధాని మోడీ అంత‌ర్జాతీయ స‌మాజానికి పిలుపునిచ్చారు. స‌భ్య దేశాల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. కరోనా మ‌హమ్మారిపై పోరాటంలో ఇండియా చేస్తున్న‌ అలుపెర‌గ‌ని పోరాటాన్ని వివ‌రించారు.

ప్ర‌పంచంలోనే ఆరోవంతు జ‌నాభా ఉన్న దేశ‌మైనా.. ఓ వైపు సొంత అవ‌స‌రాల‌ను తీర్చుకుంటూనే మ‌రోవైపు ప్ర‌పంచ‌దేశాల‌కు భార‌త్ ఎంత‌గానో సాయం చేసింద‌ని మోడీ స్ప‌ష్టం చేశారు. క‌రోనా నియంత్ర‌ణ‌ ఔష‌ధాల‌ను 150 దేశాల‌కు పంపి ఉదార‌త చాటుకుంద‌ని వివ‌రించారు. ఇక‌ ప్ర‌పంచంలోనే అత్యంగా వేగంగా 100 కోట్ల డోసుల‌ను పంపిణీ చేసిన దేశంగా భార‌త్ నిలిచింద‌ని గుర్తు చేశారు.

ఇండియాను ఫార్మ‌సీ ప్ర‌పంచంగా పోల్చిన మోడీ.. 2022 చివరి నాటికి ప్ర‌పంచానికి స‌రిపడే 5 వందల కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ల‌ను ఉత్పత్తి చేయ‌నుంద‌ని వివరించారు. ఈ సంద‌ర్భంగా వ‌న్ ఎర్త్- వ‌న్ హెల్త్ అవ‌స‌రాన్ని మోడీ నొక్కి చెప్పారు. భ‌విష్య‌త్తులో వ‌చ్చే సంక్షోభాలను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఒకే విజ‌న్‌తో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌పంచ దేశాల మ‌ధ్య వ‌స్తువుల స‌ర‌ఫ‌రాలో అవ‌రోధాలు తొల‌గించుకోవాల్సిన అవ‌స‌రాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి తెలిసేలా చేసింద‌ని జీ- 20 దేశాల‌కు గుర్తు చేశారు. ప్ర‌ప‌చంలోనే ప్ర‌స్తుతం భార‌త్ అతిపెద్ద‌ ఉత్ప‌త్తి కేంద్రంగా అవ‌త‌రించింద‌ని.. అందుకు అనుగుణంగా అనేక ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు కూడా తీసుకొచ్చిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. వ్యాపార ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డంతో పాటు.. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు దోహ‌ద‌ప‌డేలా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. మ‌రోవైపు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను గుర్తించే విష‌యంలో కొన్ని దేశాలు అవ‌లంభిస్తున్న తీరు ప‌ట్ల‌ మోడీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. భార‌త్ అభివృద్ధి చేసిన‌ కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో.. ఇత‌ర దేశాల‌కు సాయం చేసేందుకు వీలుక‌ల‌గ‌డం లేద‌ని చెప్పారు.

జీ -20 తీసుకున్న నిర్ణయాల ప‌ట్ల‌ ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. కనిష్ట కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారించ‌డం ఎంతో మేలు చేకూరుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. క‌రోనా కార‌ణంగా అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బ‌తిన్నాయ‌ని తిరిగి గాడిన‌ప‌డాలంటే ప‌ర‌స్ప‌రం స‌హ‌కరించుకోవాల‌ని పిలుపునిచ్చారు. క‌రోనా పోరాటంలో భార‌త్ విధానాల‌ను ప్ర‌శంసించిన వివిధ‌ దేశాధినేత‌ల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌తలు తెలిపారు ప్ర‌ధాని.