ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని గౌరవిస్తాం

* సమావేశ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు
* పుకార్లకు సమాధానం చెప్పక్కర్లేదు
* ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమే జనసేన ఆలోచన
* వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా ఏకం కావాలి
* అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితులకు తీరని అన్యాయం
* నేటికీ నష్ట పరిహారం లేదు.. పక్కా ఇళ్ల ఊసే లేదు
* సీఎం ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు
* క్షేత్ర స్థాయి పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తాం
* సొంత జిల్లా ప్రజలకు న్యాయం చేయని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తారు?
* తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

‘గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమావేశాన్ని మా జనసేన పార్టీ గౌరవిస్తుంది. ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బహిర్గతం చేయాలనే ఆలోచన లేదు. ఈ సమావేశంపై వస్తున్న రకరకాల భాష్యాలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శ్రీ మోదీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమావేశంలో అంశాలని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లు గురించి స్పందించాల్సిన అవసరం లేదు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. మనోహర్ ఉమ్మడి కడప జిల్లా పర్యటన కోసం రేణిగుంటకు చేరుకున్నారు. అన్నమయ్య డ్యాం జల విలయానికి ఏడాది అయిన నేపథ్యంలో ఆ ప్రాంతాలలో శనివారం పర్యటించి బాధిత ప్రజలను కలుస్తారు. రేణిగుంటలో మీడియాతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంటుంది. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల మంచి కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న కోణంలోనే సమావేశం జరిగింది. పదవుల కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆలోచించరు. ప్రజల కోసం వారి భవిష్యత్తు కోసం మాత్రమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మాత్రమే ఏ మాట అయినా మాట్లాడుతారు. వైసీపీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం, భవిష్యత్తులో అనుసరించాల్సిన విషయాలు గురించి చర్చ జరిగింది. కొన్ని అంశాలు ఎన్నికల సమయంలో రాజకీయంగాను చర్చకు వస్తాయి. వాటికి రకరకాల భాష్యాలు చెప్పి, అన్ని విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ నరేంద్ర మోదీ గారితో జరిగిన సమావేశం విషయంలో సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
* వైసీపీ వల్ల ఎంత నష్టమో వివరిస్తాం
వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం కచ్చితంగా అన్ని పక్షాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి వైసీపీ వల్ల ఎంత నష్టమో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాం. కచ్చితంగా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎంత అవసరమో తెలియజెప్పేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న దానిపై ఓ ప్రణాళిక ప్రకారం ఎన్నికల్లో ముందుకు వెళ్తాం.
* నాడు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
మీకు నేనున్నా.. మూడు నెలల్లో పక్కా ఇల్లు కట్టిస్తా. నష్టపోయిన వారందరికీ తగిన పరిహారం ఇప్పించే బాధ్యతను తీసుకుంటానని అన్నమయ్య ప్రాజెక్టు వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేటికీ నీటి మూటలుగానే మిగిలాయి. సొంత జిల్లా కడపలో ఒక ప్రాజెక్టు వరద విలయానికి తెగిపోయి, వేల మంది రోడ్డుపై పడితే తీరిగ్గా ప్రభావిత ప్రాంతాలను చూడడానికి వచ్చిన సీఎం అప్పట్లో ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. ప్రతి ఎకరాకు ఇసుక మేటలు తొలగించుకోవడానికి రూ. 12,500 ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైపోయింది. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం ఏర్పడితే, రైతులకు కనీసం న్యాయం జరగలేదు. యువతకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 44 మంది చనిపోయి, వేలాది మూగజీవాలు కొట్టుకుపోయాయి. పూర్తిస్థాయిలో వారికీ నష్టపరిహారం అందలేదు. ఇప్పటికీ సాయం కోసం బాధితులు తిరుగుతున్నారు.
* బాధితుల వేదన అర్థం చేసుకోవడం లేదు
శివారెడ్డి అనే రైతు తాడేపల్లి చుట్టూ తిరిగి చివరకు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ కూడా జరగలేదు. యువతకు ఉద్యోగాలు లేవు. అన్నమయ్య ప్రాజెక్టు బాధిత ప్రాంతాల్లో ఇప్పటికి హృదయ విదారక దృశ్యాలు కలచి వేస్తున్నాయి. సొంత జిల్లా బాధితులకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి తీరు ఆక్షేపనీయం. ఈ రెండు రోజుల్లో ప్రభావిత గ్రామాల్లో తిరిగి, కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్న విషయాలను నివేదిక రూపంలో ప్రజల ముందు ఉంచుతాం. అన్నమయ్య ప్రాజెక్టు వరద ముంపునకు పూర్తిగా నేలమట్టమైన నాలుగు గ్రామాల్లో ప్రతి ఇంటిని పరిశీలిస్తాం. క్షేత్రస్థాయిలో బాధితులు పడుతున్న వేదనను, ఆక్రందనను ప్రజలకు తెలియజేస్తాం. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని ఒక నివేదిక రూపంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తాం. దీనిపై ఆయన మార్గదర్శకాల ప్రకారం జనసేన పార్టీ బాధితులకు అండగా ఉంటుంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన వెంటనే రెండో రోజే జనసేన పార్టీ శ్రేణులు స్పందించాయి. జన సైనికులు ప్రతి ఇంటికి తిరిగి తక్షణ అవసరం కింద బియ్యం, ఇతర నిత్యవసరాలతో పాటు దుప్పట్లు, మెడికల్ సాయం అందజేశారు. మనిషిని మనిషి ఆదుకోవాలనే మానవత్వంతో విలయం జరిగిన వెంటనే జనసేన పార్టీ శ్రేణులు వేగంగా స్పందించాయి. అప్పట్లో అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఎంత మేర జనసేన పార్టీ అండగా నిలబడిందో ఇప్పుడు కూడా అదే విధంగా వారికి భుజం కాస్తాం. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. వాస్తవ పరిస్థితులు ఏమిటో కచ్చితంగా తెలుసుకుని బాధితుల పక్షాన పోరాడుతాం. బాధితులకు మూడు నెలల్లో పక్కా గృహాలు కట్టిస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం ఇప్పటికీ ఒక గృహం కూడా పూర్తి చేయకపోవడం విచారకరం. బాధితులంతా గుడారాల్లో బతుకులు వెళ్ళదీయడం కనిపిస్తోంది. వారి అందరితో మాట్లాడి, వాస్తవ పరిస్థితులపై నివేదిక తయారు చేస్తాం.
* పోలీసుల ముందే దౌర్జన్యం బాధాకరం
రాష్ట్ర మంత్రి శ్రీ జోగి రమేష్ సొంత నియోజకవర్గం పెడనలో జనసేన నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లోనే వైసీపీ గూండాలు దాడికి పాల్పడటం అత్యంత హేయం. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల ముందే వైసీపీ గూండాలు బరి తెగిస్తున్నారు. కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా వైసీపీ నాయకుల దాష్టీకాలను వివరిస్తే కేసులు పెట్టడం దారుణం. వ్యవస్థలు, చట్టాలను ఎంత మేర ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందో పెడన ఘటనతో అర్ధం అవుతుంది. జన సైనికులు బెదిరింపులకు భయపడి, కేసులకు లొంగిపోయే వారు కాదు. మీ అన్యాయాలను, అక్రమాలను నిత్యం నిలదీస్తూనే ఉంటారు. ప్రజాస్వామ్య పంథా లో పోరాటం చేస్తాం” అన్నారు.
* శ్రీ మనోహర్ కి ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన నాదెండ్ల మనోహర్ గారికి జనసేన నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. పుష్ప గుచ్ఛాలు ఇచ్చి, శాలువాలు కప్పి సత్కరించారు. స్వాగతం పలికిన వారిలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పి.హరిప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, పార్టీ నాయకులు కిరణ్ రాయల్, రాందాస్ చౌదరి, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీమతి కీర్తన, శ్రీమతి వినుత కోట, శ్రీమతి వనజ, జె.రాజారెడ్డి, శ్రీ మధుబాబు, శ్రీమతి అనిత దారం, జోగినేని మణి, పగడాల వెంకటేష్, ఎమ్.వెంకటేశ్వర రావు, మైఫోర్స్ మహేష్, పెండ్యాల హరి, సుజయ్ బాబు, ఉయ్యాల ప్రవీణ్ తదితరులు ఉన్నారు.