భారత బయోటెక్ రోటావాక్-5డి వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి

ఐదేళ్లలోపు పిల్లల్లో డయేరియా వ్యాధికి కారణమయ్యే రోటా వైరస్ పని పట్టేందుకు భారత్ బయోటెక్ మెరుగుపరిచిన రోటావాక్-5డి వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ‘ప్రీక్వాలిఫికేషన్’ లభించింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా మరింత వేగవంతం కానుంది. ఈ వ్యాక్సిన్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 0.5 మి.లీ ఇస్తే సరిపోతుంది.

అలాగే ఈ టీకా నిల్వ, సరఫరా ఖర్చు కూడా చాలా తక్కువ. రోటా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 2 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. మరో 20 లక్షల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇంతకు ముందు భారత్ బయోటెక్ నుంచి వచ్చిన ఫస్ట్ జనరేషన్ ‘రోటావాక్’ వ్యాక్సిన్.. రోటా వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధులకు అడ్డుకట్ట వేసింది.  ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ డోసుల టీకాలను భారత్ బయోటెక్ సరఫరా చేసింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ను మరింతగా అభివృద్ధి చేసింది.