నేడు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ భద్రతపై WHO నిపుణుల కమిటీ సమీక్ష

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు వార్తలు రావడంతో పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై నిషేధం విధించాయి. ప్రస్తుతం పలుదేశాల్లో టీకా పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ భద్రతపై చర్చించేందుకు నిపుణుల కమిటీ మంగళవారం సమావేశం కానున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రేయేసన్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ భద్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా కమిటీ అందుబాటులో ఉన్న డేటాను సమీక్షిస్తోందని పేర్కొన్నారు. టీకా వినియోగం, సమర్థతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై గురువారం ‘అసాధారణ సమావేశం’ నిర్వహించనున్నట్లు యూరోపియన్‌ యూనియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ తెలిపింది.

సేకరించిన సమాచారం, ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానించేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ సోమవారం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. వైరస్‌తో తీవ్రంగా పోరాడుతున్న యూరప్‌లో టీకా భద్రతపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై గందరగోళం నెలకొంది. మొదట డెన్మార్‌, నార్వే దేశాలు రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్స్‌ లెక్కింపు కేసులను గుర్తంచడంతో వ్యాక్సిన్‌ పంపిణీని నిలిపివేసింది. అనంతరం ఐర్లాండ్‌, థాయ్‌లాండ్‌, నెదర్లాండ్స్‌, నార్వే, ఐస్‌లాండ్‌, కాంగో, బల్గేరియా తదితర దేశాలు కూడా వ్యాక్సిన్‌ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించాయి. అయితే తమ టీకా సురక్షితమైనదేనని ఆస్ట్రాజెనెకా తెలిపింది. వ్యాక్సిన్‌ రక్తం గడ్డకట్టడానికి తమ టీకా తీసుకోవడమే కారణమని ఇంతవరకూ ఒక్క ఆధారం లేదని పేర్కొంది.