అభివృద్ధి లేనప్పుడు మళ్లీ జగన్ ఎందుకు?

భీమవరం: గ్రామాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయలేనప్పుడు జగనే మళ్లీ ఎందుకు కావాలని వీరవాసరం- 3 ఎంపీటీసీ సభ్యురాలు గుల్లిపల్లి విజయలక్ష్మి వైకాపా నాయకులను ప్రశ్నించారు. వీరవాసరం- 3 సచివాలయం పరిధిలో గురువారం ‘ఏపీకి జగనే మళ్లీ ఎందుకు కావాలంటే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వైకాపా మండల అధ్యక్షుడు కడలి ధర్మారావు సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. ఈ క్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు అక్కడికి చేరుకొని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికారులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వక పోవడాన్ని తప్పుబట్టారు. సమావేశంలో తాను మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తురంటూ మండిపడ్డారు. అమ్మఒడి పథకంలో తొలి ఏడాది తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు జమ చేసిన ప్రభుత్వం.. తరువాత నుంచి ఆ మొత్తాన్ని రూ. 13 వేలకు తగ్గించిందన్నారు. ఎన్నికలకు ముందు వీరవాసరం వెలమపేటలో డ్రెయిన్లు, తాగు నీటి చెరువు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట నిలబెట్టుకోలేదన్నారు. ఆమెకు స్థానిక మహిళలు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో వైకాపా నాయకులకు, ఆమెకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.