చెట్ల తొలగింపులో మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం ఎందుకు…?

పార్వతీపురం మున్సిపల్ అధికారులు ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని జనసేన పార్టీ నాయకులు అన్నారు. గురువారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో మున్సిపల్ అధికారులు చెట్లు తొలగింపు కార్యక్రమంలో అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మున్సిపాలిటీని బ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, కాలువలు, పశువులు, పందులు, ఆక్రమణలు కబ్జాలు, చెరువుల్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు తదితర సమస్యలు మున్సిపాలిటీని వేధిస్తుంటే సుమారు గత పది ఏళ్లుగా పట్టణ మెయిన్ రోడ్డులో పచ్చగా పెరిగిన చెట్లను రాత్రికి రాత్రి తొలగించే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈనెల 10వ తేదీన అధికార పార్టీ చేపట్టబోయే కార్యక్రమానికి వీలుగా మున్సిపల్ అధికారులు చెట్లు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అలాగే పార్వతీపురం మున్సిపాలిటీలో నెల్లిచెరువు, లక్ష్మి నాయుడు చెరువు, దేవుడి బంధ తదితర చెరువుల్లో అక్రమంగా భవనాలు నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు వాటిని అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. సామాన్యుడు ఇంటి మరమ్మత్తు కోసం వీధిలో కొద్దిపాటి ఇసుక వేస్తే రాబందుల్లా వాలిపోయే మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఈ అక్రమ నిర్మాణాల్లో ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక వారి హస్తము ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ పనితీరు ప్రజా వ్యతిరేకంగా ఉందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది వ్యవహార శైలిపై చర్యలు చేపట్టాలని కోరారు. పచ్చగా ఉండే పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో ఉన్న చెట్లను తొలగించి బీడుగా మార్చారన్నారు. ఈ చర్యలు సరికాదని దీనికి కమిషనర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. లేని పక్షంలో తాము తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.