ఆవేదన తెలియచేస్తే పథకాలు తీసేస్తామని రైతులను బెదిరిస్తారా?

• తడిచిన ప్రతి గింజనూ కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
• రైతులకు అండగా జనసేన నిలుస్తుంది

అకాల వర్షాలతో పంటలు కోల్పోయి రైతులు ఆవేదనలో ఉంటే వారికి ధైర్యం చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలు నెరవేర్చడంలో మరోసారి విఫలమైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. నీట మునిగిన పంటను చూసి బాధలో ఉన్న రైతు తమ ఆవేదనను పంచుకొనే అవకాశం లేకుండా ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేసి, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరం. మీడియా ముందుగానీ, ప్రతిపక్షాల దగ్గరగానీ మాట్లాడితే పథకాలు తీసేస్తామని రైతులను బెదిరిస్తున్న దాఖలాలు మా దృష్టికి వచ్చాయి. తడిచిన ధాన్యం రైతులది కాదు, వ్యాపారులది అంటూ సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కష్టపడి సాగు చేసే రైతును ఈ విధంగా వేధిస్తున్న తొలి ప్రభుత్వం వైసీపీదే. పంటలు కోల్పోయిన రైతులను కలిసి జనసేన పక్షాన అండగా ఉంటామని చెప్పాలని మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకులకు, శ్రేణులకు సూచించారు. ఆ మేరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నాయకులు క్షేత్ర స్థాయిలో రైతాంగాన్ని కలిసి నష్టాలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పంట కోతలు మొదలయ్యే సమయానికి ఆర్బీకేల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కనీసం సంచులుగానీ, టార్పాలిన్ షీట్లుగానీ అందించలేకపోయింది. వరి, మొక్కజొన్న మొలకలు వచ్చేస్తున్నాయని జనసేన శ్రేణులు గుర్తించాయి. వరి సాగు చేస్తే ఎకరాకి 33 బస్తాలు మాత్రమే తీసుకొంటామని చెప్పడం కూడా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గత మూడేళ్లుగా ప్రతి పంట సీజన్లో రైతులు నష్టాల పాలవుతున్నారు. నష్ట పరిహారం చెల్లింపు కూడా సక్రమంగా చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిచిన ప్రతి గింజను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. తేమ శాతం, కొనుగోలు పరిమితి లాంటి నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందిపెడితే జనసేన పార్టీ కచ్చితంగా రైతుల పక్షాన నిలిచి పోరాడుతుందని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.