కౌలు రైతు కుటుంబాల కన్నీళ్లు తుడిచి… రూ.లక్ష ఆర్థిక సాయం అందించి…

• అనంతపురం జిల్లాలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర
• 30 కుటుంబాలకు ఆర్థిక సాయం

సాగు నష్టాలతో అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. వారి కన్నీళ్లు తుడిచి బిడ్డల చదువులకు పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం కౌలు రైతు భరోసా యాత్రకు అనంతపురం జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గం.కు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కొత్త చెరువు గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు శ్రీ సాకే రామకృష్ణ గారి కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య శ్రీమతి సాకే సుజాతకు అందజేశారు. ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని శ్రీమతి సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అనంతరం ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ధర్మవరంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాజశేఖర్ రెడ్డి మరణానికిగల కారణాలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన భార్య శ్రీమతి చంద్రకళకు అందజేశారు. రాజశేఖర్ రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి విద్య బాధ్యతలను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.
• ఇప్పుడు మా ఖాతాల్లో సాయం డబ్బులు వేస్తామని ఫోన్లు చేస్తున్నారు
ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాబు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాబు మరణం తరువాత తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య శ్రీమతి మల్లికకు అందజేశారు. ఈ సందర్భంగా కుమార్తెలు ఇద్దరిని పలకరించిన పవన్ కళ్యాణ్ వారి చదువుల గురించి ఆరా తీశారు. ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో వారి చదువులకు ఎటువంటి ఆంటకం ఏర్పడకుండా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. బత్తలపల్లి గ్రామానికి చెందిన కలుగురి రామకృష్ణ సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన భార్య శ్రీమతి నాగలక్ష్మికి అందజేశారు. సందర్భంగా రామకృష్ణ కుమారుడు మహేష్ మాట్లాడుతూ “12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్లం. పంటనష్టం, చేసిన అప్పులు తీర్చలేక మా నాన్న గారు అన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మా తండ్రి చనిపోయి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా మా ఇంటికి రాలేదు. కానీ మీరు వస్తున్నారని తెలియగానే మా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారని ఫోన్ చేసి మరీ చెబుతున్నార”ని చెప్పారు. అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు శ్రీ మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని భార్య శ్రీమతి అరుణమ్మకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా చిన్నగంగయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా పలుకరించి ఓదార్చారు. మరో 26 కౌలు రైతు కుటుంబాలకు మన్నీల గ్రామంలో గ్రామ సభలో రూ.లక్ష చొప్పున చెక్కులు అందచేశారు.
• జనసేనానికి అడుగడుగునా జననీరాజనం
ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ. లక్ష సాయం అందించి, భరోసా కల్పించేందుకు అనంతపురం జిల్లాకు వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు, పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమం కోసం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారికి బసంపల్లి గ్రామంలో ఆడపడుచులు ప్రధాన రహదారి మీదకు వచ్చి హారతులు పట్టి, పూల వర్షం కురిపించారు. నిమ్మలకుంట గ్రామం మొత్తం రోడ్డు మీదకు వచ్చి తప్పెట్లతో ఘన స్వాగతం పలికారు. ఆహ్వానం పలికేందుకు రోడ్డు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. కొత్తచెరువు, ధర్మవరంలలో వేల సంఖ్యలో ప్రజలు జయజయ ధ్వనాలు పలికారు. గొట్లూరులో కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ గారికి స్థానిక పార్టీ శ్రేణులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. దారి పొడుగునా యువత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహన శ్రేణిని అడ్డుకుని సమస్యలు వివరించేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరు విద్యుత్ కోతల వెతల్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. గొట్లూరు నుంచి పూలకుంట వరకు మార్గం మొత్తం రహదారికి ఇరువైపులా భారులు తీరి జనసేన నినాదాలతో హోరెత్తించారు. ఇటుకలపల్లి జంక్షన్ నుంచి పూలకుంట వరకు ప్రతి ఇంటి నుంచి ప్రజలకు బయటకు వచ్చి ఆయనకు హారతులు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. పర్యటన ఆధ్యంతం పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు కె. నాగబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు టి.సి. వరుణ్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు కళ్యాణం శివశ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాస్, జయరామిరెడ్డి, రాందాస్ చౌదరి, పెండ్యాల హరి, భవాని రవికుమార్ తదితరులు పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.