తెలంగాణాలో పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుతో 800 మందికి ఉద్యోగావకాశాలు

రాష్ట్రoలో త్వరలో అడ్వాన్స్‌డ్‌ పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం కానుంది. ఎస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.1350 కోట్లతో ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేయనుందని, ఈ మేరకు ఆ కంపెనీ సోమవారం తన సమ్మతిని తెలిపింది. ఎస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ చైర్మన్‌ అరవింద్‌ సింఘానియాతో మంత్రి కేటీఆర్‌ సోమవారం వర్చువల్‌ మీటింగ్‌ లో మాట్లాడారు. రాష్ట్రoలో ఎస్టర్‌ కంపెనీ ఏర్పాటుపై మంత్రి సంతోషాన్ని తెలియపరిచారు. తొలిదశ నిర్మాణం కోసం కంపెనీ రూ.500 కోట్లు ఖర్చు చేయనుందని 2022 మూడో త్రైమాసికo నాటికి తొలి దశ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా 800 మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్యాకేజింగ్‌ పరిశ్రమకు చెందిన పాలిమర్‌ ఉత్పత్తులను ఇక్కడ తయారవుతాయి. ఉత్పత్తిలో 30 నుంచి 40 శాతం వరకు ఎగుమతి చేయనున్నట్లు సంస్థ తెలిపింది. తెలంగాణకు ఈ కంపెనీ ఏర్పాటుతో ప్యాకేజింగ్‌ పరిశ్రమలో ప్రత్యేక స్థానం దక్కనుందని ఎస్టర్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు ఉండడం వలనే తాము పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయo తీసుకున్నామని సింఘానియా తెలియాచేశారు. ఇండియాలోనే ఎస్టర్‌ పరిశ్రమ పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. 56 దేశాలకు తమ పాలిమర్‌ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు  తెలియాచేశారు.