4,230 పంచాయతీల్లో గెలిచాం: చంద్రబాబు

ఎస్‌ఇసికి సహకరిస్తే అధికారులను బ్లాక్‌ లిస్టులో పెడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరించారని, జమిలీ ఎన్నికలయ్యే వరకే ఆయన మంత్రిగా ఉంటారేమో కానీ అనంతరం తాము ఆయనను బ్లాక్‌ లిస్టులో పెడతామని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రెండేళ్ల అధికారానికే మిడిసి పడుతున్నారన్నారు. మంగళగిరి టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు సాక్ష్యాధారాలతో వినతిపత్రాలు అందజేస్తామని, అనంతరం కోర్టుల్లో కేసులు వేసి న్యాయపోరాటం చేస్తామని అన్నారు. అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల్లో భాగంగా 4,230 పంచాయతీల్లో విజయం సాధించామన్నారు. నాలుగో విడతలో 41.07 శాతం సీట్లు సాధించామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే మరో 10 శాతం సీట్లు గెలిచేవారమన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఎన్నికల అక్రమాలపై తానే స్వయంగా 31 లేఖలు ఎస్‌ఇసికి రాశానని తెలిపారు.

ఎస్‌ఇసి తన అధికారాలను ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందిందన్నారు. 2013లో పోలింగ్‌ శాతం కంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆరు శాతం ఓటింగ్‌ తగ్గిందన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగుంటే పోలింగ్‌ పెరిగి ఉండేదన్నారు. వైసిపి అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు పెట్టి టిడిపి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసినా ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడిన ప్రజాస్వామ్య వాధులకు పాదాభివందనాలు చేస్తున్నాన న్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తామని టిడిపి నేతలను ఓ పోలీస్‌ అధికారి బెదిరించారని, కుప్పంలో టిడిపి లేకుండా చేస్తానన్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య పాల్గొన్నారు.