ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక మార్పు..!

ముంబయి: ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక మారింది. లార్డ్స్‌లో జరగాల్సిన ఫైనల్స్‌ను సౌతాంప్టన్‌కు మర్చారు. ఈ మేరకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. ఇటీవల భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా టీమిండియా 3-1 తేడాలో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో టీమిండియా ఫైనల్స్‌కు చేరింది. ఇక జూన్‌ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరులో భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ ఫైనల్‌ మ్యాచ్‌ ముందుగా లార్డ్స్‌ స్టేడియంలో జరుగుతుందని ప్రకటించారు. తాజాగా లార్డ్స్‌ కాదు.. సౌతాంప్టన్‌లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన గంగూలీ.. ‘టీమిండియా-న్యూజిలాండ్‌ మధ్య జరిగే ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. లార్డ్స్‌ స్టేడియంలో కాకుండా సౌతాంప్టన్‌లో మ్యాచ్‌ జరగబోతోంది. ఇక్కడి స్టేడియంలోనే అనేక సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టేడియంలోనే హోటల్‌ ఉండడంతో బయోబబుల్‌ ఏర్పాటు చేసేందుకు ఇరు జట్లకు అనువుగా ఉంటుంది. కరోనా తర్వాత ఇంగ్లాండ్‌ ఎక్కువ మ్యాచ్‌లను సౌతాంప్టన్‌లో ఆడడానికి కారణం ఇదే’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, వేదిక మార్పుపై ఐసిసి ఇంత వరకూ స్పందించ లేదు.