వేద ఘోషతో ప్రతిధ్వనిస్తున్న యాగశాల

ధర్మ పరిరక్షణ… ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యాగం రుత్వికుల వేద ఘోషతో కొనసాగుతోంది. తొలుత విఘ్నాధిపతి గణనాధుని అర్చన, అంకురార్పణతో యాగం ప్రారంభం కాగా, తదనంతరం ఆవాహనాది విశిష్ట కలశ స్థాపన సహిత దేవతాహ్వాన పూజ ప్రారంభమైంది. ఈ పరిక్రమలో భాగంగా దేవతాలంకార అస్త్రాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రణతులు సమర్పించారు. ఆయన నిత్యం ఆరాధించే దేవతామూర్తులను శాస్త్రోక్తంగా యాగ పీఠానికి ఉత్సవరీతిలో తోడ్కొని వచ్చారు. గణపతి పూజ, అంకురార్పణ సమయంలో ధవళ వస్త్రాలు ధరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేవతా ఆవాహన క్రతువులో కుంకుమ వర్ణ వస్త్రాలను ధరించారు. ఉత్సవమూర్తులను పూజా పీఠంపై అధిష్టింప చేసిన తర్వాత తత్ దేవాతా ధ్యానవాహనాది షోడశోపచార పూజాసహిత మంత్ర పంచాగ విధాన అనుష్టానం ఆరంభించారు. ఇందులో భాగంగా జప, తర్పణ, పారాయణ, హోమ, అభిషేకాలను రుత్వికులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు.
• గురుబ్రహ్మలకు పుష్పాభిషేకం
యుక్త వయసులో ఉన్నప్పుడే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలోని యోగిని రాజేశ్వరి గారి వద్ద ధ్యాన మార్గాన్ని స్వీకరించిన సంగతి సన్నిహితులకు, స్నేహితులకు విదితమే. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేత రామ్ లాల్ ప్రభుజీ దీక్షను యోగిని రాజేశ్వరి గారు ఆచరింప చేశారు. ఆ సమయంలోనే శక్తి పాతాన్ని ఆమె ప్రసాదించారు. రామ్ లాల్ ప్రభుజీ, బడే బాబా చిత్తరువులతోపాటు తన తండ్రి గారయిన శ్రీ కొణిదల వెంకట్రావు గారి చిత్తరువును గురు స్థానంలో యాగపీఠంపై నిలిపారు. అనంతరం వారి ముగ్గరి చిత్రపటాలకు పూల మాలలు వేసి పూజాధికాలు జరిపారు.
• తండ్రే గురువు
చిన్నతనం నుంచే తనలో ధర్మం, సామాజిక చైతన్యం రగిల్చిన తన తండ్రి శ్రీ వెంకట్రావు గారిని కూడా గురువుగానే భావించి గురుస్థానంలో నిలిపినట్టు ఈ సందర్బంగా తెలియచేశారు. సనాతన ధర్మంతో పాటు అన్ని మతాల సారాన్ని చిన్ననాటి నుంచే తనకు చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామయి, స్వామి వివేకానందల జీవిత చరిత్ర తన తండ్రి ద్వారానే తెలుసుకున్నానని, అందువల్ల ఆయనను గురువు స్థానంలో నిలుపుకున్నానని భక్తి పూర్వకంగా తెలియచేశారు. తొలుత గణపతి పూజ, ఆ తర్వాత నూతనంగా నిర్మించబోయే కేంద్ర కార్యాలయ భవనానికి శంకుస్థాపన, అనంతరం అనుష్టానం యాగశాల ఆవరణలో నిరాటంకంగా కొనసాగుతుంది.