పోలింగ్‌ కేంద్రం పై వైసిపి కార్యకర్తల దాడి

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని కందరాడ గ్రామంలో పోలింగ్‌ కేంద్రం పై వైసిపి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల కౌంటింగ్‌ విషయంలో అక్కడ ఉద్రిక్తలు నెలకొనడంతో అధికారులు కౌంటింగ్‌ ను నిలిపివేశారు. కందరాడ గ్రామంలో ఎన్నికలు ముగిసిన తరువాత కౌంటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఆ గ్రామంలో టిడిపి బలపరిచిన అభ్యర్థి ముందంజలో ఉండగా, వైసిపి మద్దతుదారులు రెచ్చిపోయారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి చొరబడి బ్యాలెట్‌ పేపర్లను ఎత్తుకెళ్లారు. ఫర్నిచర్‌ ను ధ్వంసం చేసి బ్యాలెట్‌ పత్రాలను చింపేశారు. దీంతో అధికారులు కౌంటింగ్‌ ను నిలిపివేశారు. వైసిపి మద్దతుదారులు రెచ్చిపోవడంతో, టిడిపి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.