వైసీపీ కాపు నాయకులారా మీ వల్ల కాపు జాతికి జరిగిన ప్రయోజనం ఏమిటి?

పెడన, కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుంది వైసిపిలో ఉన్న కాపు నాయకుల పరిస్థితి. పవన్ కళ్యాణ్ ని విమర్శించకపోతే మంత్రి పదవి ఉండదు, అకారణంగా విమర్శిస్తుంటే కాపు జాతి అసహ్యించుకుంటుంది. వైసీపీలో ఉన్న ప్రతి కాపు నాయకుడికి స్వప్రయోజనాలే తప్ప జాతి ప్రయోజనాలు పట్టవు. ఎన్నడు కూడా వీళ్లు సొంత కులం యొక్క అవసరాలను గాని, సమస్యలను గాని పట్టించుకోలేదు. బడుగు బలహీన వర్గాలతో సహా మైనారిటీ, కాపు కులస్తులు జనసేన పార్టీకి పూర్తి మద్దతు పలకడంతో కలవరపడుతున్న కాపు నాయకులు తూతూ మంత్రంగా రాజమండ్రిలో సమావేశమై హడావిడి చేయడం జరిగింది. వైసిపి కాపు నాయకులకు ఒకటే సూటి ప్రశ్న. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మీరు కాపులకు వెలగబెట్టింది ఏమిటి? కాపు జాతికి మీ నాయకుడు ఇచ్చిన హామీ కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి ₹2,000 కోట్లు ఇస్తానన్నాడు. ఈ మూడున్నర సంవత్సరాలలో కాపు కార్పొరేషన్ కు ఎన్ని కోట్లు మీరు నిధులు సమకూర్చారు శ్వేత పత్రం విడుదల చేయగలరా? వైసిపి ప్రభుత్వం వచ్చినాక వివిధ రంగాల్లో నామినేషన్ ద్వారా అనేక పదవులను తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టినప్పుడు జనాభా ప్రాతిపదికన మా కాపు కులానికి కూడా ప్రాధాన్యత కల్పించండి అని ఎందుకు అడగలేకపోయారు? స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా మీద కపట ప్రేమను చూపించే మీరు జిల్లాల పునర్విభజన సమయంలో కృష్ణాజిల్లాలో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? మీరు గొప్పగా చెప్పుకునే కనీసం కాపు నేస్తం పథకానికైనా మన కాపు జాతిలో ఉన్న ప్రముఖుల పేర్లు ఎందుకు పెట్టలేకపోయారు? ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా కాపు జాతి అవసరాలు, సమస్యల మీద చర్చ జరిపారా? ఎపుడూ మీ అధినాయకుని ఆదేశాలతో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి, సత్యదూర ఆరోపణలు చేయడం తప్ప ప్రజా సమస్యలను గాని కాపు జాతి సమస్యలను గాని పట్టించుకున్న పాపాన పోలేదు. రాబోయే రోజుల్లో వైసీపీలో ఉన్న కాపు నాయకులు కాపు జాతిని మోసం చేసిన చరిత్ర హీనులుగా మిగిలి పోవడం ఖాయం. కాపు జాతిపై ఏ మాత్రం ప్రేమాభిమానాలు ఉన్న ఇప్పటికైనా బానిసత్వంలో నుంచి బయటకు వచ్చి కాపులకు సేవ చేయండని పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు.