వైసీపీ నేతలే ప్రజల పాలిట కాలయముళ్లు

  • పర్యాటక శాఖామంత్రి అంటే రాష్ట్రాన్ని వదిలిపెట్టి ప్రజాధనంతో ప్రపంచం మొత్తం తిరగటం కాదు
  • వైసీపీకి అధికారం జనసేన పెట్టిన భిక్ష
  • నాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని జనసేన ప్రశ్నించబట్టే ప్రజలు అధికార మార్పు కోరుకున్నారు
  • ఆర్నెళ్లకోసారి కూడా తాడేపల్లి ప్యాలస్ దాటని జగన్ రెడ్డే అసలైన కుంభకర్ణుడు
  • పూటకో మడమ, గడియకో మాట మడమ తిప్పిందేవరో ప్రజలకు తెలుసు
  • అసెంబ్లీ సాక్షిగా రాజధానిగా అమరావతిని వైసీపీ నేతలు ఒప్పుకోలేదా?
  • అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరిట రాక్షస క్రీడలు మొదలు పెట్టింది ఎవరు?
  • జనసేన అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటే వైసీపీ నేతలు అవినీతిని, అరాచకత్వాన్ని, దోపిడీని వికేంద్రీకరణ చేశారు.
  • ఉత్తుత్తి రాజీనామా డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
  • పవన్ కళ్యాణ్ అడిగిన విధానపరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కువిమర్శలు చేస్తే సహించేది లేదు
  • పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయాలు చేయకపోతే మీకు కలలో కూడా ఆయన నామస్మరణ ఎందుకు?
  • సొంత నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లే ధైర్యం లేని మంత్రి రోజా కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం విడ్డూరం
  • వైసీపీ నేతల అధికారమదం దిగే రోజులు ఎంతోదూరంలో లేవు
  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి.

గుంటూరు, తమ అవినీతి , అరాచక, దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చారని, ప్రజా కంటక పాలనతో వైసీపీ నేతలే ప్రజల పాలిట కాలయముళ్లుగా మారారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తూ కుంభకర్ణుడులా వ్యవహరిస్తున్నారని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పర్యాటక శాఖామంత్రి అంటే ప్రజాధనంతో ప్రపంచం మొత్తం పర్యటించడం కాదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజాధనాన్ని దోచుకుంటున్న అవినీతి నేతలను నిలదీస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడు కాదని, అందినకాడికి దోచుకొని జనానికి భయపడి తాడేపల్లి ప్యాలస్ లో పడుకొని, ఆర్నెళ్లకోసారి బ్యారికేడ్ల మధ్య భయం భయంగా తిరిగే జగన్ రెడ్డే అసలైన కుంభకర్ణుడని విమర్శించారు. గడియకో మాట, పూటకో మడమ తిప్పుతుంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా వైసీపీ నేతలు ఒప్పుకోలేదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి సొంత ఇళ్లు రాజధాని అమరావతిలోనే కట్టుకున్నాడని వైసీపీ నేతలందరూ క్యూ కట్టుకొని మరీ ప్రజల్ని మోసం చేసింది నిజం కాదా అని నిలదీశారు. దేవుడి ముందు అబద్దాలు ఆడటానికి తెగించిన వాళ్ళకి రాష్ట్ర ప్రజల ముందు అబద్దాలు ఆడటంలో వింతేముందన్నారు. అధికారంలోకి రాగానే వైసీపీ నేతలు మూడు రాజధానుల పేరిట కాలకూట విషపూరిత రాజకీయాలకు తెరతీసారని దుయ్యబట్టారు. విశాఖపట్నం రాజధాని అయితే అభివృద్ధి చెందేది ఉత్తరాంధ్ర ప్రజలు కాదని, వైసీపీ నాయకులని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను జనసేన కోరుకుందని, వైసీపీ నేతలు మాత్రం అవినీతిని, అరాచకాలను, దోపిడీని వికేంద్రీకరణ చేసారని దుయ్యబట్టారు. మొదటినుంచి రాజధాని రైతులకు అండగా నిలిచింది పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు. ముప్పైమూడు వేల ఎకరాలు ఎలాంటి గ్యారంటీ లేకుండా ఇస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం మారితే రైతుల పరిస్థితి ఏమిటంటూ రైతుల పక్షాన ధైర్యంగా, నిజాయితీగా నిలబడి ప్రశ్నించింది కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడేనన్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతల రాజీనామా డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పైశాచిక రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన విధానపరమైన అంశాలకు సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఎంతటివారినైనా చూస్తూ ఊరుకోమని ఆళ్ళ హరి హెచ్చరించారు.