రెల్లి కులస్తులకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి

గుంటూరు: రెల్లి కులాన్ని అవమానపరుస్తూ, రెల్లి కులస్థుల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు శ్రీనివాస చక్రవర్తి తక్షణమే రెల్లి జాతికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్, జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీనివాస చక్రవర్తితో పాటూ, ప్రముఖ యు ట్యూబ్ ఛానెల్ రిపోర్టర్ బాలిశెట్టి నాగరాజుపై యస్సీ యస్టీ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సోమి ఉదయ్ మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలో రెల్లి జాతి పేరు చెప్పుకునేందుకే సిగ్గుపడుతున్నారంటూ శ్రీనివాస చక్రవర్తి మాట్లాడటం తమ జాతిని కించపరిచినట్లుగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి జాతిని అవమాన పరిచేలా ఉన్న వీడియోను యు ట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలని లేనిపక్షంలో రెల్లి యువత నుంచి వైసీపీ నేతలు, యు ట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సోమి ఉదయ్ హెచ్చరించారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచక, నియంత పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ నేతలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కుటుంభంపై అసత్యాలు మాట్లాడిన ప్రతీఒక్కరూ దిక్కులేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. వారాహి విజయయాత్ర మొదటిదశ విజయవంతం అవటంతో పాటూ వైసీపీ దుర్మార్గాలను పవన్ కళ్యాణ్ పూసగుచ్చినట్లు ప్రజలకు వివరించటంతో వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అధికార మార్పిడి తధ్యం అన్న భయం వైసీపీ నేతల్ని వెంటాడుతుందని ఈ నేపథ్యంలో మరిన్ని అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం నుంచి ఎంత తొందరగా వైసీపీని తరిమికొడితే అంత వేగంగా రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని ఆళ్ళ హరి అన్నారు. ఎస్పీని కలిసిన వారిలో రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు, నరసింహ తదితరులున్నారు.