అక్బర్ బాషాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి నాయకులను అరెస్టు చేయాలి..

ఆత్మకూరు: ఎస్ పేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు అక్బర్ బాషా ను దుర్భాషలాడిన వైసిపి నాయకులను, నేటి వరకు అరెస్టు చేయనందుకు నిరసనగా ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి డి.ఎస్.పి గారి ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం డిఎస్పీ గారికి నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ జనసైనికులతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడం చేతగాక ప్రశ్నించిన వాడిపై ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా దాడి చేయాలని చూడడం వైసిపి నాయకులకు పరిపాటిగా మారిపోయింది అన్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ బాషా గారిని మైనారిటీ నాయకుడు అయిన కారణంగా నువ్వు పాకిస్తాన్ వాడివని, నానా రకాలుగా దుర్భాషలాడిన విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయమై స్థానిక ఏఎస్పేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఫిర్యాదు చేసి దాదాపుగా వారం గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయడం గానీ విచారించడం గాని జరిగిన పాపాన పోలేదు. భారతీయులందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించినప్పటికీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి వారికి మాత్రమే ప్రత్యేక హక్కులు ఉన్నాయి అన్న చందంగా పోలీసులు తయారవడం వింత కొలిపిస్తుంది. చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ వ్యవస్థ ఈ విధంగా నిర్వీర్యమైపోయి చేష్టలుడికి చూస్తుండడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. శుక్రవారం పిఠాపురంలో జరిగిన సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నేరపూరిత రాజకీయాలపై ధ్వజమెత్తరం జరిగింది. రేపు 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ అరాచక శక్తులను ఉక్కు పాదంతో అణచివేస్తామని హెచ్చరించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసిపి పాలనలో దగా పడిన ప్రజల గొంతుకై జనసేన పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆత్మకూర్ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్బర్ బాషా, డబ్బుగొట్టు నాగరాజ, సురేంద్ర, వంశీ, చంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.