మోజు పడ్డ భూములపై వైసీపీ లీజు వల.. సయ్యద్ నాగుర్ వలి

  • పార్టీ కార్యాలయాల కోసం విలువైన భూములకు వైసీపీ ఎసరు
  • లీజు పద్ధతిలో నామమాత్రపు ధరకు కేటాయింపులు
  • వేగంగా శంకుస్థాపనలు, తదనంతర చర్యలు
  • ఎన్నికలు రాకమునుపే నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశాలు
  • రాష్ట్రమంతటా భూ దోపిడీకి పచ్చజెండా

సత్తెనపల్లి నియోజకవర్గం: మండల కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ .. అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం భూములను కొల్లగొట్టడానికి సిద్ధమయింది. వచ్చే ఎన్నికల నాటికి అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల ఏర్పాటు లక్ష్యంతో శరవేగంగా అడుగులు వేస్తోంది. అందుబాటులో ఉన్న, విలువ ఎక్కువగా ఉండే ప్రాంతాల భూములపై కన్నేసింది. ముందుగా భూములను గుర్తించడం… రాత్రికి రాత్రి పార్టీ కార్యాలయాల కోసం శంకుస్థాపనలకు సిద్ధం చేసేలా స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించింది. ఒకటి రెండు అని కాదు.. అందుబాటులో ఉన్న జిల్లాల్లో స్థలాలను స్వాధీనం చేసుకుని, సుదీర్ఘకాలం లీజు పద్ధతిలో వైకాపాకు ప్రభుత్వం కట్టబెడుతోంది. నామమాత్రపు లీజు సొమ్ముతో విలువైన స్థలాలను పార్టీకి దాదాపు రాసిచ్చే ప్రక్రియ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ స్థలాలు, వివాదాస్పద భూములు అయినా పట్టించుకోకుండా దుందుడుకుగా ముందుకు సాగుతోంది.

*విశాఖపట్నం జిల్లాలోని ఎండాడ పనోరమ హిల్స్ లో అత్యంత విలువైన రూ.58 కోట్ల స్థలం వైఎస్సార్సీపీ వశమైంది. ఇక్కడ విలాసవంతమైన పార్టీ భవనం నిర్మించాలనే తలంపుతో 2 ఎకరాల స్థలాన్ని అప్పనంగా ఆరగించేలా కుట్ర జరిగింది. వాణిజ్య అవసరాలకు, ఇతర అవసరాలకు ఉంచాల్సిన భూమిని వైసీపీ కార్యాలయానికి కట్టబెట్టారు. సర్వే నెంబరు 175/4లో ఉన్న రెండు ఎకరాల భూమిలో భవిష్యత్తులో స్మార్ట్ ప్రాజెక్టులు రూపకల్పన చేసే అవకాశం ఉన్నా దాన్ని పట్టించుకోలేదు. కేవలం నామమాత్రపు లీజు ధర ఏడాదికి 3 వేల రూ.లు చొప్పున 33 ఏళ్లకు కట్టబెట్టారు.

*అనకాపల్లి జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం వైకాపా ఏకంగా గ్రామ అవసరాల కోసం ఉంచిన భూమిపై కన్నేసింది. అనకాపల్లి మండలం కొత్త నర్సింగిపేటలో జాతీయ రహదారికి అనుకొని ఉన్న 1.75 ఎకరాల అత్యంత విలువైన భూమిని పార్టీ కార్యాలయం కోసం కొట్టేయాలని పన్నాగం పన్నింది. రూ.15 కోట్ల విలువైన భూమిని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. కేవలం ఎకరాకు రూ.1000 లీజు సొమ్ము చెల్లించేలా మొత్తం స్థలానికి రూ.1750లు చెల్లించేలా భూమిని కట్టబెట్టేందుకు, నిర్మాణం కోసం శంకుస్థాపనలు జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అడిగిందే తడవుగా పార్టీ కార్యాలయం నిమిత్తం స్థలం చూపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే స్థలం విలువ 5.20 రూ.ల కోట్లు ఉంటే, కేవలం నామమాత్రపు లీజుకు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకోవడం విశేషం.

*కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో సర్వే నెంబరు 110లో ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయం నిమిత్తం అప్పగించారు. వైసీపీ నాయకులు ఎంచుకున్న స్థలం ఆదికవి నన్నయ యూనివర్సటీ మల్లాడి సత్యలింగ నాయకర్ పీజీ సెంటర్ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి నిమిత్తం ఉంచారు. అయితే ఆ స్థలం విషయంలో వివాదం రేగడంతో అధికారులు వెనక్కు తగ్గి, రమణయ్యపేటలోని 115/2 లోని రెండు ఎకరాలు ఇవ్వాలని కోరిన వెంటనే మంజూరు చేశారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఆ స్థలాన్ని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన కట్టబెట్టారు. ఇక్కడ గజం విలువ రూ.80 వేలు ఉంటుంది. అంటే రూ.77 కోట్ల స్థలం వైసీపీ వశం అయింది.

*రాజమహేంద్రవరంలో అత్యంత విలువైన కేంద్ర కారాగారం స్థలం మీదనే వైసీపీ నేతల కన్ను పడింది. అత్యంత విలువైన రెండు ఎకరాల స్థలాన్ని తమకు అప్పగించాలని జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా కోరిన వెంటనే అనుమతులు మంజూరైనా చివరి నిమిషంలో జైళ్ల శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. 48 కోట్ల రూ.ల విలువున్న ఈ స్థలం జైళ్లశాఖది కావడంతో ప్రస్తుతం ఈ విషయం సైలెంట్ అయింది.

*ఏలూరు జిల్లా పరిధిలో ఏలూరులో అత్యంత విలువైన 1.90 ఎకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయం కోసం 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఇచ్చారు. అల్లూరి సీతారామ రాజు మైదానం పక్కనే భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఉంచిన స్థలం ఇది. క్రీడా అవసరాల కోసం ఉంచిన ఈ స్థలాన్ని అప్పటికప్పుడు జిల్లా నాయకుడు, ఏలూరు ఎమ్మేల్యే ఆళ్ల నాని కోరిక మేరకు రాసిచ్చారు. కేవలం ఏడాదికి 1500 రూ.ల లీజు ప్రాతిపదికన ఈ స్థలాన్ని కట్టబెట్టారు. ఇప్పటికే ఈ స్థలంలో చదును పనులు మొదలు పెట్టారు. క్రీడా అవసరాల కోసం ఉంచిన స్థలం ఇలా ఇవ్వడంపై విపక్షాలు ఎన్ని ఉద్యమాలు చేసినా, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవు.

*గుంటూరు నగరంలో వైసీపీ కార్యాలయానికి అమరావతి రోడ్డు పక్కనే, వైద్య కళాశాల బాలుర హాస్టల్ ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో తాగునీటి అవసరాల నిమిత్తం రిజర్వాయర్ నిర్మించాలని గుంటూరు కార్పొరేషన్ భావించింది. మొత్తం 97 సెంట్ల విలువైన స్థలం ఇది. ఈ స్థలాన్ని వైసీపీ కార్యాలయం కోసం ఇవ్వాలని అడిగిందే తడవుగా కార్పొరేషన్ తీర్మానం చేసి, అధికారులకు పంపడం అక్కడి నుంచి లీజు ఉత్తర్వులు రావడం జరిగిపోయింది. భవిష్యత్తులో ఆస్పత్రి విస్తరణ నిమిత్తం లేదా కార్పొరేషన్ అవసరాల నిమిత్తం ఉంచాల్సిన భూమిని ఇలా కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఈ స్థలం విలువ 28 రూ.ల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

*బాపట్ల నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలాన్ని వైకాపా కార్యాలయం నిమిత్తం శంకుస్థాపన చేశారు. జిల్లా నాయకుడు మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో తతంగం నడించింది. ఆర్టీసీ అధికారులు దీనిపై అభ్యంతరం చెప్పినా అధికార పార్టీ నాయకులు దాన్ని పట్టించుకోలేదు. ఆర్టీసీ స్థలమని రికార్డులు చూపించినా వారు వినలేదు. 1990లో 10.60 ఎకరాల విలువైన స్థలాన్ని ఆర్టీసీ 3.40 రూ.ల లక్షలకు కొనుగోలు చేసింది. 6.60 ఎకరాల్లో ఆర్టీసీ డిపోను నిర్మించి, మిగిలిన స్థలం అవసరాల నిమిత్తం ఉంచింది. పక్కనే 216 నంబరు జాతీయ రహదారి రావడంతో స్థలం విలువ బాగా పెరిగింది. ఎకరా భూమి 8 రూ.ల కోట్లు ఉంది. అంటే రెండు ఎకరాలు 16 రూ.ల కోట్ల మేర విలువైన స్థలానికి సంబంధించి.. ఆర్టీసీ అధికారుల అభ్యంతరాలు పట్టించుకోకుండా అధికారులు లీజు ఉత్తర్వులు ఇచ్చారు. స్థలంలో డ్రైవింగ్ శిక్షణ యూనిట్ మొదలుపెట్టాలని ఆర్టీసీ భావించినా… ఎప్పటి నుంచో స్థలం మీద కన్నేసిన వైసీపీ నేతలు ఇలా వారి పంతం నెగ్గించుకొని విలువైన స్థలం హాంఫట్ చేశారు.

*పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోనూ విలువైన స్థలాన్ని వైసీపీ కార్యాలయం నిమిత్తం కొట్టేశారు. నరసరావుపేటలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ల పక్కనే స్థలం ఉంది. ఇక్కడ ఎకరా ధర 12 కోట్ల రూ.ల పైమాటే. గతంలో ఈ ఎకరంన్నర స్థలంలో ఆదాయపుపన్ను శాఖ కార్యాలయ నిర్మాణం శంకుస్థాపన జరిగింది. అయితే ఎప్పటి నుంచో స్థలం మీద కన్నేసిన నేతలు అందివచ్చిన అవకాశాన్ని పార్టీ కార్యాలయం నిమిత్తం చక్కగా వాడుకున్నారు. ఎకరంన్నర స్థలం తమకు కట్టబెట్టాలని జిల్లా అధికారులను కోరిన వెంటనే అక్కడి నుంచి ఆగమేఘాల మీద లీజు ఉత్తర్వులు వచ్చాయి. మొత్తం 33 ఏళ్ల లీజుకు ఏడాదికి 1500 రూ.ల కు వైకాపా కార్యాలయం నిమిత్తం స్థలం కట్టబెట్టారు. దీంతో ఇక్కడ నిర్మాణ పనులను ప్రారంభించారు.

*శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఏకంగా వైసీపీ నాయకుల కన్ను ఎయిర్ పోర్టు ముందున్న స్థలం మీదనే పడింది. ఎయిర్ పోర్టు ముందు సర్వే నెంబరు 666లో 9.25 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ స్థలంలో కొంత భాగం పేదల ఇంటి స్థలాలకు, రైతులకు సాగు పట్టాలు ఇచ్చారు. మిగిలిన రెండు ఎకరాల స్థలం మీద వైసీపీ కన్నేసింది. కార్యాలయానికి స్థలం కావాలని స్థానిక నేతలు అడిగిందే తడవుగా అనుమతులు వచ్చాయి. 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఎకరాకు ఏడాదికి కేవలం 1000 రూ.ల లీజు సొమ్ము ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ ఎకరా స్థలం రూ.10 కోట్లు పలుకుతోంది. 20 రూ.ల కోట్ల స్థలాన్ని అడిగిందే తడవుగా ఇచ్చేయడం వివాదానికి దారి తీస్తోంది.

*అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల నిమిత్తం స్థలాలను చూసుకోవాలని వైసీపీ అధినాయకత్వం నుంచి జిల్లాల నాయకులకు ఆదేశాలు వెళ్లాయి. 25 జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు విశాలంగా ఉండేలా, ఎన్నికల ముందే నిర్మాణం మొదలు పెట్టేయాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. దీనికోసం నిబంధనలు, వివాదాలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని, లీజు ప్రాతిపదిక ప్రకారం అయితే ఏ చిక్కులూ రావనే కోణంలో ప్రస్తుత పంథాలో ముందుకు వెళుతోందని సయ్యద్ నాగుర్ వలి తెలిపారు.