నాన్నా మీరే నా హీరో.. హార్ధిక్‌ పాండ్యా ఎమోషనల్‌ పోస్ట్‌

భారత క్రికెటర్లు హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం మరణించిన విషయం తెలిసిందే. 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో వడోదరలో తుది శ్వాస విడిచారు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల ప్రముఖ క్రికెటర్లందూ సంతాపం తెలిపారు.

ఇదిలా ఉంటే తండ్రి పోయిన బాధను తట్టుకోలేకపోతున్న హార్ధిక్‌ పాండ్యా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. తండ్రిని హద్దుకొని ముద్దు పెడుతోన్న సందర్భంలో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన హార్ధిక్‌ భావోద్వేగంతో కూడిన క్యాప్షన్‌ జోడించాడు. ఈ సందర్భంగా హార్ధిక్ ఇలా రాసుకొచ్చాడు.. ‘నాన్నా.. మీరు నా హీరో.. మీరు లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఇది చాలా కష్టం. మీరు వదిలి వెళ్లిన ఎన్నో మధుర జ్ఞాపకాలను, మీ స్వచ్ఛమైన నవ్వును ఎప్పటికీ మరవలేం. అన్నయ్య (కృనాల్‌ పాండ్యా), నేను ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి మీరే కారణం. మీరు లేకపోవడంతో ఈ ఇంటికి కళ తప్పింది. మీ పేరు నిలబెట్టడానికి ప్రతీ క్షణం కృషి చేస్తూనే ఉంటాం. మీరు ఎక్కడున్నా మాపై మీ చల్లని చూపు ఉంటుందని ఆశిస్తున్నాము. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజూ, ప్రతి క్షణం మిమ్మల్ని మిస్‌ అవుతూనే ఉంటా. లవ్‌ యూ డాడీ’ అంటూ సుధీర్ఘ పోస్ట్‌ చేశాడు పాండ్యా.